- మరోసారి భారత్ పై అక్కసు వెళ్లగక్కిన బంగ్లాదేశ్..
- ప్రజల అదృశ్యం వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపణలు..
- బంగ్లాదేశీయుల మిస్సింగ్ పై విచారణ కమిషన్ ఏర్పాటు: మహ్మద్ యూనస్
Bangladesh: భారత దేశంపై మరోసారి బంగ్లాదేశ్ తాతాల్కిక ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కింది. తాజాగా, బహిష్కృత ప్రధాని షేక్ హసీనా హయాంలో ప్రజలను బలవంతంగా అదృశ్యమైన ఘటనల వెనుక భారత్ హస్తం ఉందని తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ఆరోపించింది. ఈ అదృశ్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇక, ప్రజలను బలవంతపు అదృశ్యాలలో భారతదేశ ప్రమేయం ఉందని ప్రభుత్వ వార్తా సంస్థ బంగ్లాదేశ్ సంగ్‌బాద్ సంస్థా కథనాలు ప్రచురించింది.
కాగా, బంగ్లాదేశ్ కు చెందిన కొంతమంది ఖైదీలు ఇప్పటికీ భారతీయ జైళ్లలో ఉండవచ్చనే అభిప్రాయం ప్రభుత్వ సంస్థలలో ఉందని సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి మైనుల్ ఇస్లాం చౌదరి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిషన్ వెల్లడించింది. భారతదేశంలో నిర్బంధించబడిన బంగ్లాదేశ్ జాతీయులను గుర్తించడానికి అనేక ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని బంగ్లా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు విచారణ కమిషన్ సూచనలు జారీ చేసింది. బంగ్లాదేశ్ వెలుపల ఈ విషయాన్ని దర్యాప్తు చేయడం కమిషన్ అధికార పరిధికి మించినదని పేర్కొన్నారు.