Leading News Portal in Telugu

Israel: After Ten Years, Military Discovers the Body of Soldier Oron Shaul in Gaza Operation


Israel  : పదేళ్ల తర్వాత తన సైనికుడి డెడ్ బాడీ కనుగొన్న ఇజ్రాయెల్

Israel : గాజా-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ సమయంలో గాజా స్ట్రిప్‌లో జరిగిన రహస్య ఆపరేషన్‌లో సైనికుడు స్టాఫ్ సార్జెంట్ ఒరాన్ షాల్ మృతదేహాం అవశేషాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) పేర్కొంది. 2014 గాజా యుద్ధంలో హమాస్ ఒరాన్ షాల్‌ను హత్య చేసింది. ఈ మృతదేహాన్ని వెలికితీసే ఆపరేషన్ ఐడీఎఫ్, షిన్ బెట్ భద్రతా సంస్థలు కలిసి నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో నేవీకి చెందిన షాయెటెట్ 13 కమాండో యూనిట్, మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్‌కు చెందిన అనేక ప్రత్యేక విభాగాలు ఉన్నాయనీ సమాచారం అందింది. అయితే, ఈ ఆపరేషన్ ఎప్పుడు జరిగింది, గాజాలో ఎక్కడ మృతదేహం దొరికింది అనే వివరాలు అందజేయలేదు.

ఓరాన్ షాల్ మృతదేహాన్ని ఇజ్రాయెల్‌కు తిరిగి తీసుకువచ్చి అబూ కబీర్ ఫోరెన్సిక్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించారు. దర్యాప్తు అనంతరం, అతని కుటుంబానికి సమాచారం అందజేయబడింది. 2014 జూలై 20న గోలాని బ్రిగేడ్ 13వ బటాలియన్ సైనికులు గాజా నగరంలోని షెజయా పరిసరాల్లో M-113 సాయుధ సిబ్బంది క్యారియర్‌తో ప్రవేశించారు. ఆ సమయంలో, అతని ఏపీసీ ఒక ఇరుకైన వీధిలో చిక్కుకుంది. హమాస్ యోధులు ట్యాంక్ వ్యతిరేక క్షిపణులతో దాడి చేశారు. ఈ దాడిలో ఒరాన్ షాల్ సహా మరో ఏడుగురు ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. షాల్ మృతదేహాన్ని హమాస్ యోధులు తీసుకెళ్లారు.

2014 గాజా హమాస్ యుద్ధం
2014 గాజా యుద్ధం గాజా ప్రజలకు కూడా ఎంతో భయంకరంగా మారింది. 50 రోజుల యుద్ధంలో దాదాపు 2,251 మంది పాలస్తీనియన్లు మరణించారు. వారిలో 1,462 మంది పౌరులు, 551 మంది పిల్లలు, 299 మంది మహిళలు ఉన్నారు. ఈ ఘర్షణలో 66 మంది ఇజ్రాయెల్ సైనికులు, ఐదుగురు ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. మరణించిన వారిలో ఒక చిన్నారి కూడా ఉంది. అలాగే, 11,231 మంది పాలస్తీనియన్లు గాయపడ్డారు, వారిలో 3,540 మంది మహిళలు, 3,436 మంది పిల్లలు ఉన్నారు. ఈ చిన్నారులలో దాదాపు మూడింట ఒక వంతు మంది జీవితాంతం వైకల్యంతో బాధపడుతున్నారు.