Leading News Portal in Telugu

The Ambanis meet US President-elect Trump, to attend his swearing-in ceremony


  • ప్రమాణస్వీకారానికి ముందు డొనాల్డ్ ట్రంప్ విందు..
  • సతీసమేతంగా హాజరైన ముఖేష్ అంబానీ..
Donald Trump: ప్రమాణస్వీకారానికి ముందు ట్రంప్ విందు.. సతీసమేతంగా హాజరైన ముఖేష్ అంబానీ..

Donald Trump: సోమవారం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నేతలు, టెక్-వ్యాపార దిగ్గజాలు హాజరవుతున్నారు. ప్రమాణస్వీకారం ముందు రోజు వాషింగ్టన్‌లో ట్రంప్ క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ట్రంప్ కుటుంబంతో సన్నిహితంగా ఉండే ముఖేష్ అంబానీ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడిన 100 మంది ప్రపంచ నాయకులు, ప్రముఖుల జాబితాలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఉన్నారు.

ట్రంప్ కుటుంబంతో అంబానీ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2017లో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ కోసం హైదరాబాద్‌కి ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ వచ్చిన సందర్భంలో కూడా ముఖేష్ అంబానీ హాజరయ్యారు. 2020లో డొనాల్డ్ ట్రంప్ భారత్ వచ్చిన సమయంలో కూడా అంబానీ కుటుంబం హాజరైంది. 2024లో ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహానికి కూడా ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెన్ కుష్నర్, వారి పెద్ద కుమార్తె అరబెల్లా రోజు గుజరాత్ జామ్‌నగర్‌కి వచ్చారు.

ఈ కార్యక్రమానికి భారత్ నుంచి అధికారికంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకానున్నారు. ఎలాన్ మస్క్ , జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్, సుందర్ పిచాయ్ వంటి ప్రపంచ వ్యాపార నాయకులు, అలాగే బరాక్ ఒబామా, కమలా హారిస్, హిల్లరీ క్లింటన్ వంటి రాజకీయ ప్రముఖులు ఇతర ప్రముఖులు హాజరవుతారు.