Leading News Portal in Telugu

Donald Trump is sworn in as the President of the United States


  • అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం
  • 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం
  • ట్రంప్ చేత ప్రమాణం చేయించిన చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్
Donald Trump 2.0: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. అగ్ర రాజ్యానికి 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం చేశారు. ట్రంప్ చేత అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. క్యాపిటల్ రోటుండాలో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతిరథ మహారథులంతా హాజరయ్యారు. వేదిక పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వాషింగ్టన్‌లో విపరీతమైన చలి కారణంగా ప్రమాణస్వీకార వేడుకను ఆరుబయట కాకుండా క్యాపిటల్‌ భవనంలో నిర్వహించారు. రొనాల్డ్‌ రీగన్‌ 1985లో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పుడు సైతం ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి అలా జరుగుతోంది.

ఈ కార్యక్రమానికి అమెరికా మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్‌, జార్జి బుష్‌, బరాక్‌ ఒబామా, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్‌ మిలి, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ హాజరయ్యారు. రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ దంపతులు, టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌, మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌, యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌, టిక్‌టాక్‌ సీఈవో షోజీ చ్యూ, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తదితరులు హాజరయ్యారు.