Leading News Portal in Telugu

Donald Trump Administration Orders Leave For Federal Diversity Staff, Layoffs Looming


  • మరోసారి దూకుడు పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..
  • ఫెడరల్‌ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్‌ సిబ్బంది అందరికీ లేఆఫ్‌లు..
  • సిబ్బందినీ ఈరోజు సాయంత్రం వరకు వేతనంతో కూడిన సెలవుపై పంపాలని ఆదేశాలు..
Layoffs in US: ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు.. ఆ ఉద్యోగులకు లేఆఫ్స్

Layoffs in US: రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ పాలనలో మరోసారి దూకుడు పెంచాడు. జో బైడెన్‌ ప్రభుత్వం జారీ చేసిన 78 ఆదేశాలను క్యాన్సిల్ చేయడంతో పాటు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లు జారీ చేశారు. తాజాగా, ఫెడరల్‌ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్‌ సిబ్బంది అందరికీ లేఆఫ్‌లు ఇవ్వడానికి ట్రంప్ కార్యవర్గం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వారందరినీ సెలవులో ఉంచాలని జీవో జారీ చేసింది. ఇక, అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వానికి చెందిన డైవర్సిటీ, ఇన్‌క్లూజన్‌ ప్రోగ్రామ్‌లను నిర్వీర్యం చేయడానికి ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌లపై సంతకం పెట్టారు.

ఇక, ఈ నేపథ్యంలోనే సిబ్బంది నిర్వహణ కార్యాలయం మెమో రిలీజ్ చేసింది. ఆ జీవో ప్రకారం.. ఇన్‌క్లూజన్‌, డైవర్సిటీ, ఈక్విటీ సిబ్బంది అందరికి ఈరోజు (జనవరి 22) సాయంత్రం 5 గంటల వరకు వేతనంతో కూడిన సెలవులపై పంపాలని సంబంధిత ఏజెన్సీలకు ఆదేశాలు పంపించారు. ఈ విభాగాలకు చెందిన అన్ని వెబ్‌ పేజీలను కూడా గడువులోగా తొలగించేయాలని పేర్కొన్నారు. అలాగే, దీంతో పాటు డీఈఐ సంబంధిత శిక్షణ కార్యక్రమాలను తక్షణమే ముగించడంతో పాటు ఈ విభాగాలు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని ఏజెన్సీలకు ట్రంప్ కార్యవర్గం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని వెబ్ సైట్లను తొలగించగా.. వచ్చే శుక్రవారం నాటికి వీరికి లేఆఫ్‌లు ఇచ్చి ఫెడరల్‌ సిబ్బంది సంఖ్యలో కోత విధించాలని డొనాల్డ్ ట్రంప్‌ సర్కార్ యోచిస్తుంది. ఉద్యోగాల కోతపై కొత్త అధ్యక్షుడి కార్యాలయ సిబ్బంది నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన బయటకు రాలేదు. ఈ నిర్ణయం ఎంత మందిపై ప్రభావం చూపనుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.