Leading News Portal in Telugu

NASA Astronaut Shares Stunning Photos Of Maha Kumbh Mela From Space


  • ఆకాశం నుంచి అద్భుతంగా కుంభ మేళా..
  • అంతరిక్ష నుంచి ఫోటో తీసిన నాసా వ్యోమగామి..
  • కుంభమేళా వెలిగిపోతుందంటూ కామెంట్స్..
Maha Kumbh Mela from space: “వెలిగిపోతున్న కుంభ మేళా”.. అంతరిక్షం నుంచి నాసా వ్యోమగామి ఫోటో..

Maha Kumbh Mela from space: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ హిందువుల ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. దేశ విదేశాల నుంచి ప్రయాగ్‌రాజ్ వద్ద జరుగుతున్న ‘‘మహా కుంభ మేళా’’కి కోట్ల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. కోట్ల సంఖ్యలో భక్తులు ఒకే చోటకు చేరడం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కుంభమేళ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది. చివరకు పాకిస్తాన్, యూఏఈ వంటి ఇస్లామిక్ దేశాల్లో కూడా కుంభ మేళ గురించి నెటిజన్లు ఆసక్తిగా సెర్చ్ చేశారు.

ఇదిలా ఉంటే, ఈ అద్భుతమైన జనసమాగమం అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములను కూడా ఆకర్షిస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నుంచి నాసాకు చెందిన వ్యోమగామి డాన్ పెటిట్ కుంభమేళని ఫోటో తీశారు. 400 కి.మీ ఎత్తులో భూమి చుట్టూ తిరుగుతున్న ఐఎస్ఎస్ నుంచి తీసిన ఫోటోలో ప్రయాగ్ రాజ్, ముఖ్యంగా కుంభమేళా జరుగుతున్న ప్రదేశం ‘‘ వెలిగిపోతోంది’’. ‘‘2025 మహా కుంభమేళా గంగా నది తీర్థయాత్ర రాత్రిపూట ISS నుంచి. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమావేశం బాగా వెలిగిపోతుంది’’ అంటూ ఎక్స్‌లో తన ఫోటోలను పోస్ట్ చేశారు.

ప్రతీ 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళకి భారీగా తరలివస్తున్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కొనసాగే ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి 45 కోట్ల మంది వరకు భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేసింది. తాజాగా నాసా వ్యోమగామి ఫోటో వైరల్‌గా మారింది. ఇది ఒక “సూపర్ నోవా”ను గుర్తు చేస్తుందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘‘వావ్ విజువల్స్ అద్భుతం’’ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు.

యూపీ సర్కార్ కుంభమేళ కోసం 24 గంటల పాటు విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకుంది. రూ. 400 కోట్లతో 182 కి.మీ హై టెన్షన్ లైన్స్, 40,000 రీ ఛార్జబుల్ బల్బులు, త్రివేణి సంగమం వద్ద 2700 సీసీటీవీ కెమెరాలు, నీటిలో ప్రయాణించే డ్రోన్లు, ఏఐ ఆధారిత భద్రతా చర్యల్ని ఏర్పాటు చేసింది.