- అమెరికన్ పౌరులకు ఆదాయపన్ను లేకుండా చూస్తాం..
- అమెరికన్లను ధనవంతులను చేసే వ్యవస్థను సృష్టిస్తాం..
- ఇన్‌కమ్ ట్యాక్స్ ఎత్తేస్తే వచ్చే నష్టాన్ని ఇతర దేశాలపై పన్నులు వేసి పూడ్చుకోవాలి..
- భారత్, చైనా సహా పలు దేశ ఉత్పత్తులపై పన్నులు పెంచనున్న డొనాల్డ్ ట్రంప్..

Donald Trump: యూఎస్ పౌరులకు ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచడానికే ఈ దిశగా తాము అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. యూఎస్ పౌరులను ధనవంతులు చేసే వ్యవస్థ పునరుద్ధరణ దిశగా.. ఇవి ఉపయోగపడుతాయని ఆయన తెలిపారు. అయితే, అమెరికా ఆదాయంలో ఇన్‌కమ్ ట్యాక్స్ ద్వారా చెప్పుకోదగ్గ స్థాయిలో డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో ఆ మేరకు కోతపడితే.. దాన్ని చేసుకోవడానికి దిగుమతి సుంకాలను ఉపయోగించుకోవాలని చూస్తున్నారని సమాచారం.
ఇక, ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికన్లను ధనవంతులుగా మార్చే వ్యవస్థలోకి మనం వెళుతున్నామని వెల్లడించారు. ఇతర దేశాలను సుసంపన్నం చేసేందుకు మన వారిపై ట్యాక్సులు చేయడం కంటే.. మనమే విదేశాలపై పన్నులు వేయడంతో యూఎస్ ప్రజలను సంపన్నులు చేయొచ్చని పేర్కొన్నారు. వీటిని వసూలు చేసేందుకు ఎక్స్‌టర్నల్ రెవెన్యూ సర్వీసును స్టార్ట్ చేసినట్లు తెలిపారు. అమెరికా చరిత్రలోనే 1870 నుంచి 1913 మధ్య ప్రజలు అత్యధిక సంపదను కలిగి ఉన్నారని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.
అయితే, భారత్, చైనా, బ్రెజిల్‌పై అత్యధిక ట్యాక్సులు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇతర దేశాలు కూడా ఏం చేస్తున్నాయో మనం చూడొచ్చు అన్నారు. చైనా భారీగా సుంకాలు వసూలు చేస్తుండగా.. భారత్, బ్రెజిల్ సహా ఇతర దేశాలు కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నాయని చెప్పుకొచ్చారు. కానీ, మనకు అమెరికా ప్రయోజనాలే అన్నింటికంటే ముందుండాలన్నారు. గత డిసెంబర్‌లోనే బ్రిక్స్ దేశాలు ప్రత్యేక కరెన్సీ తీసుకొస్తే 100 శాతం పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించాడు. యూఎస్ డాలర్ వినియోగం నిలిపేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.