Leading News Portal in Telugu

bangladesh locals vandalised girls football match venue


Bangladesh : బంగ్లాదేశ్‌లో అమ్మాయిలు ఫుట్‌బాల్ ఆడడం పై గొడవ.. గ్రౌండ్ లో విధ్వంసం

Bangladesh : క్రీడలతో సహా ప్రతి రంగంలో మహిళలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రపంచవ్యాప్తంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఆటలోనూ వారిని ముందుకు తెస్తున్నారు. మరోవైపు, బంగ్లాదేశ్ నుండి భిన్నమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల బంగ్లాదేశ్‌లో అమ్మాయిలు ఫుట్‌బాల్ ఆడడం పై గొడవ జరిగింది. ప్రపంచంలోని అనేక దేశాలలో బాలికలు ఒలింపిక్స్ నుండి జాతీయ, అంతర్జాతీయ క్రీడల వరకు అనేక క్రీడలలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. బంగ్లాదేశ్‌లో మహిళలు తమ సొంత నగరంలో ఫుట్‌బాల్ ఆడటానికి కూడా అనుమతి లేదు.

జనవరి 28న అకేల్‌పూర్ ఉపజిల్లాలోని తిలక్‌పూర్ హైస్కూల్ మైదానంలో రెండు మహిళా జట్ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరగాల్సి ఉంది.. కానీ మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు ప్రజలు గొడవ సృష్టించి మైదానాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్ మీడియా ప్రకారం.. మదర్సా విద్యార్థులు మైదానాన్ని ధ్వంసం చేశారు. టి-స్టార్ క్లబ్ అనే స్థానిక స్పోర్ట్స్ క్లబ్ ఈ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను నిర్వహించింది. దీని కోసం వారు గత ఒక నెల రోజులుగా సన్నాహాలు చేస్తున్నారు. దీని కోసం క్లబ్ ప్రజల మధ్య టిక్కెట్లను కూడా అమ్ముతోంది. గ్రౌండ్ సీటింగ్ టిక్కెట్లు రూ.30కి, కుర్చీలకు రూ.70కి అమ్ముతున్నారు. టోర్నమెంట్ చివరి మ్యాచ్‌కు ముందు, జోయ్‌పుర్హాట్, రంగ్‌పూర్‌కు చెందిన రెండు మహిళా జట్ల మధ్య ఒక మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, స్థానిక ప్రజలలో ఒక వర్గం ఈ మ్యాచ్‌ను వ్యతిరేకించిందని నిర్వాహకులు తెలిపారు. మహిళలు క్రీడల్లో పాల్గొనడాన్ని నిరసనకారులు వ్యతిరేకించారు.

జనవరి 28న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మదర్సా విద్యార్థులతో సహా నిరసనకారులు తిలక్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద గుమిగూడారు. దీని తరువాత మహిళల ఫుట్‌బాల్ మ్యాచ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న బృందం ఫుట్‌బాల్ మ్యాచ్ జరగాల్సిన మైదానానికి చేరుకుంది. ప్రజలు మైదానాన్ని ధ్వంసం చేశారు. నిరసనకారుల చర్య వల్ల లక్ష రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని టి-స్టార్ క్లబ్ అధ్యక్షుడు, స్థానిక బిఎన్‌పి నాయకుడు సమియుల్ హసన్ ఇమోన్ అన్నారు. మదర్సా విద్యార్థులు, స్థానిక ఇస్లాంవాదులు మైదానం బారికేడ్లను బద్దలు కొట్టారని అకేల్‌పూర్ పోలీస్ స్టేషన్ చీఫ్ అనిసుర్ రెహమాన్ తెలిపారు. ఈ విషయంలో అధికారికంగా ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని ఆయన అన్నారు.