- అమెరికాలో విమానం మిస్సింగ్
- టేకాఫ్ అయిన నిమిషాల్లోనే అదృశ్యం
- విమానం జాడ కోసం గాలింపు

అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రోజుల వ్యవధిలోనే వరుస ఘటనలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇటీవల విమానం కుప్పకూలి ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో ప్రమాదంలో విమానాన్ని, హెలికాఫ్టర్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 64 మంది ప్రయాణికులు మరణించారు. ఈఘటనలు మరువకముందే అమెరికాలో మరో విమానం అదృశ్యమయ్యింది. టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఆచూకీ లేకుండా పోయింది.
గాల్లోకి ఎగిరిన కాసేపటికే ఏటీసీతో విమానం కమ్యూనికేషన్ కోల్పోయిందని సమాచారం. విమానం రాడార్ వ్యవస్థతో సంబంధం కోల్పోవడంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. విమానం జాడ కనుగొనేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా అమెరికాలో బేరింగ్ ఎయిర్ సంస్థకు చెందిన సెస్నా 208బీ గ్రాండ్ కారవాన్ అలస్కా మీదుగా ఉనాలక్‌లీట్ నుంచి నోమ్‌కు వెళ్తుండగా అదృశ్యమైనట్లు తెలుస్తోంది. విమానం మిస్సింగ్ సమయంలో అందులో 10మంది ఉన్నట్లు సమాచారం.