Leading News Portal in Telugu

Truck crashed into bus carrying passengers in southern Mexico


  • దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం
  • బస్సును ఢీకొన్న ట్రక్కు
  • 41 మంది సజీవ దహనం
Southern Mexico: బస్సును ఢీకొన్న ట్రక్కు.. 41 మంది సజీవ దహనం

ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో భారీగా ప్రాణ నష్టం జరుగుతోంది. తాజాగా మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ మెక్సికోలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 41 మంది మరణించారు. 48 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొట్టిందని మెక్సికోలోని టబాస్కో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగడంతో ఈఘోరం చోటుచేసుకుందని అధికారులు వెల్లడించారు.

బస్సు కాన్కున్ నుంచి టబాస్కోకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సులోని 38 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు మృతిచెందినట్లు తెలిపారు. ట్రక్కు డ్రైవర్ కూడా మరణించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 38 మృతదేహాలను వెలికితీసినట్లు వెల్లడించారు. ప్రమాద ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైందని అధికారులు చెప్పారు. ప్రమాదంలో మరణించిన వారి వివరాలను సేకరించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయని, ప్రమాదానికి గల కారణాలపై ఆరాతీస్తున్నట్లు అధికారులు చెప్పారు.