Leading News Portal in Telugu

“He’s already struggling with his wife.” Trump promises he won’t deport Prince Harry.


  • ప్రిన్స్ హ్యారీ ఇప్పటికే భార్యతో ఇబ్బందిపడుతున్నాడు..
  • అతడిని యూఎస్ నుంచి బహిష్కరించను..
  • హ్యారీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
Prince Harry: “ఇప్పటికే భార్యతో కష్టపడుతున్నాడు”.. అతడిని బహిష్కరించనని ట్రంప్ హామీ..

Prince Harry: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. డాక్యుమెంట్లు లేకుండా యూఎస్‌లో ఉంటున్న వారిని వెతికి మరీ వారివారి దేశాలకు పంపుతున్నాడు. ఇటీవల మన భారతదేశానికి చెందిన అక్రమ వలసదారుల్ని కూడా తిరిగి పంచించేశాడు. ఇదిలా ఉంటే, అమెరికా అధ్యక్షుడు ప్రిన్స్ హ్యారీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రిన్స్ హ్యారీని అమెరికా నుంచి బహిష్కరించే అవకాశం లేదని చెప్పారని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. శుక్రవారం న్యూయార్క్ పోస్ట్‌కి ట్రంప్ ఇచ్చిన ఇంటర్వ్యూలో .. హ్యారీపై చర్యలు తీసుకోవాలనుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘నేను అతన్ని ఒంటరిగా వదిలేస్తాను. అతనికి తన భార్యతో తగినంత సమస్యలు ఉన్నాయి. ఆమె చాలా దారుణంగా ఉంది’’ అని ట్రంప్ అన్నారు. హ్యారీ వీసాకు సంబంధించిన చట్టపరమైన సవాళ్ల మధ్య ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో హ్యారీ అక్రమ డ్రగ్స్ వాడకాన్ని వెల్లడించడంలో విఫలమవడంపై హెరిటేజ్ ఫౌండేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.

హ్యారీ అన్నయ్య ప్రిన్స్ విలియంపై ట్రంప్ ప్రశంసలు కురిపిస్తూ.. ‘‘గ్రేట్ యంగ్ మ్యాన్’’ అని అన్నారని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. నిజానికి ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ ట్రంప్‌కి అస్సలు పడదు. వీరిద్దరు ఒకరినొకరు ద్వేషించుకుంటారు. ఒకానొక సందర్భంలో మేఘన్ ట్రంప్‌ని ‘‘విభజనకారుడు’’, ‘‘స్త్రీ ద్వేషి’’ అంటూ విమర్శించింది. దీనికి ట్రంప్.. హ్యారీని పలు సందర్భాల్లో ఎగతాళి చేశారు. యువరాజుని మేఘన్ కొరడాతో కొడుతారని, పాపం హ్యారీ అనేక కష్టాలు అనుభవిస్తున్నాడని అన్నారు. 2020లో బ్రిటిష్ రాజకుటుంబం నుంచి ప్రిన్స్ హ్యారీ నిష్క్రమించారు. ఆ తర్వాత మేఘన్, హ్యారీలు ఇద్దరు అమెరికాలోని కాలిఫోర్నియాకు మకాం మార్చారు.