Leading News Portal in Telugu

China rejects Trump’s proposal on Gaza


  • గాజాని స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్..
  • గాజా పాలస్తీనాకే చెందుతుందన్న చైనా..
Gaza: గాజా విషయంలో ట్రంప్‌ని సవాల్ చేసిన చైనా..

Gaza: ఇటీవల డొనాల్డ్ ట్రంప్ గాజాపై చేసిన ప్రకటన సంచలనంగా మారింది. గాజాలోని పాలస్తీనియన్లను ఇతర అరబ్ దేశాలు తీసుకోవాలని సూచించారు. పాలస్తీనియన్లకు జోర్డాన్, ఈజిప్ట్ దేశాలు ఆశ్రయం కల్పించాలని లేదంటే సాయం నిలిపేస్తామని ట్రంప్ హెచ్చరించారు. పాలస్తీనియన్లు ఖాళీ చేసిన తర్వాతే గాజాని స్వాధీనం చేసుకుంటామని, అప్పుడు మాత్రమే గాజా పునర్ నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు. గాజాపై తన ప్రతిపాదన గురించి జోర్డాన్ రాజుతో మాట్లాడినట్లు ట్రంప్ చెప్పారు. అయితే, ఈ ప్రతిపాదనని జోర్డాన్ తోసిపుచ్చింది. మరోవైపు అరబ్ లీగ్ ఛీప్ కూడా పాలస్తీనియన్ల తరలింపు ఆమోదయోగ్యం కాదని అన్నారు.

గాజా విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని చైనా సవాల్ చేసింది. గాజా ‘‘పాలస్తీనియన్లకు చెందినది’’ అని చైనా బుధవారం చెప్పింది. బలవంతంగా గాజా ప్రజల్ని తరలించడాన్ని వ్యతిరేకించింది. గాజా పాలస్తీనాలో అంతర్భాగమని, ప్రజల్ని బలవంతంగా తరలించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ఆ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ అన్నారు. మరోవైపు ట్రంప్ ప్రకటనను హమాస్ కూడా తప్పుపట్టింది. గాజాను కొనుగోలు చేసి అమ్మడానికి రియల్ ఎస్టేట్ బిజినెస్ కాదని, పాలస్తీనాలో గాజా విడదీయలేని భాగమని చెప్పింది.