Leading News Portal in Telugu

Israel calls up reservists as fears for fragile Gaza ceasefire rise


  • పశ్చిమాసియాలో మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు
  • సైన్యాన్ని అలర్ట్ చేసిన ఇజ్రాయెల్
Hamas-Israel: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. సైన్యాన్ని అలర్ట్ చేసిన ఇజ్రాయెల్

హమాస్-ఇజ్రాయెల్ మధ్య మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. శనివారంలోగా ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని అమెరికా, ఇజ్రాయెల్ అల్టి మేటం విధించింది. లేదంటే పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చాయి. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ బెదిరింపులకు తలొగ్గేదేలేదని హమాస్ అంటోంది. ఈ నేపథ్యంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనే పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్.. తన సైన్యానికి పిలుపునిచ్చింది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని కోరింది. ఈ నేపథ్యంలో మరోసారి హమాస్-ఇజ్రాయెల్ మధ్య మరో భీకరపోరు తప్పదని తెలుస్తోంది.

Hamas

జనవరి 19 నుంచి హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతోంది. హమాస్.. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తోంది. అలాగే ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తోంది. అయితే ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని.. ఇలాగైతే బందీలను విడుదల చేసే ప్రస్తక్తేలేదని హమాస్ హెచ్చరించింది. దీంతో మరోసారి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. హమాస్ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ..శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు మొత్తం ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేయాలని.. లేదంటే నరకం చూస్తారని హెచ్చరించారు. ఇవే వ్యాఖ్యలు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ కూడా చేశారు. బందీలు విడుదల చేయకపోతే.. గతంలో కంటే తీవ్ర పరిణామాలుంటాయని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది.

అయితే అమెరికా, ఇజ్రాయెల్ హెచ్చరికలను హమాస్ తోసిపుచ్చింది. ఒప్పందం ప్రకారమే బందీలను విడుదల చేస్తాం కానీ.. ఒకేసారి విడుదల చేయబోమని స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం ఈ శనివారం ముగ్గురు బందీలనే విడుదల చేస్తామని ప్రకటించింది.

ఇక తాజా పరిణామాల నేపథ్యంలో ఈజిప్ట్, ఖతార్ అత్యవసర మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పాలస్తీనా సమస్యలపై అరబ్ శిఖరాగ్ర సమావేశాన్ని ఈజిప్ట్ ఏర్పాటు చేసింది. గాజా, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ట్రంప్ వ్యాఖ్యలపై చర్చించనున్నారు. ఇటీవలే గాజాను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ప్రకటించారు. పాలస్తీనా వాసుల్ని జోర్డాన్, ఈజిప్ట్‌కు పంపిస్తామని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలను అరబ్ దేశాలు ఖండిస్తున్నాయి. చైనా కూడా స్పందిస్తూ.. గాజా పాలస్తీనీయులదేనని వ్యాఖ్యానించింది. తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అరబ్ శిఖరాగ్ర సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

2023, అక్టోబర్7న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి 250 మందిని గాజాలోకి బందీలుగా తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగిలిపోతుంది. ఐడీఎఫ్ దళాలు చేసిన దాడుల్లో వందలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణుగుతున్నాయనుకుంటున్న సమయంలో మరోసారి తీవ్రతరం అయ్యాయి. ఏం కాబోతుందో చూడాలి.