- గంగా నదిలో బ్యాక్టీరియోఫేజ్‌లు..
- ఇవే నీరు స్వచ్ఛంగా ఉండేందుకు కారణం..
- ప్రముఖ పరిశోధకుడి వెల్లడి..

MahaKumbh Mela: ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా చివరి దశకు చేరుకుంది. జనవరి 13 నుంచి ప్రారంభమైన ఈ అద్భుత జన సంగమం ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగుస్తోంది. ప్రభుత్వం లెక్కల ప్రకారం ఇప్పటికే 50 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. గంగా నది నీరు తాగేంత స్వచ్ఛంగా ఉన్నాయని చెప్పారు. తాజాగా, ఓ అధ్యయనం గంగా నది నీటి స్వచ్ఛత గురించి సంచలన విషయాన్ని వెల్లడించింది.
ప్రముఖ శాస్త్రవేత్త అజయ్ సోంకర్ గంగా నది గురించి సంచలనాత్మక విషయాన్ని ఆవిష్కరించారు. నదిలోని ‘‘బ్యాక్టీరియోఫేజ్’’లు గంగాని సహజంగా శుద్ధి చేస్తున్నట్లు తేల్చారు. 1100 రకాల బ్యాక్టీరియోఫేజ్‌లు కాలుష్యాన్ని తగ్గించి, నీటిని శుద్ధి చేస్తున్నాయని, వాటి సంఖ్య కన్నా 50 రెట్లు ఎక్కువ సూక్ష్మ క్రిములను చంపుతున్నాయని, వాటి RNAని కూడా మారస్తున్నట్లు వెల్లడించారు. బ్యాక్టీరియోఫేజ్‌లు తాము అంతమయ్యే ముందు కాలుష్యాలను, హానికరమైన బ్యాక్టీరియాలను తొలగించినట్లు ఆయన చెప్పారు. గంగా నదికి సముద్ర జలాలకు ఉండే శక్తి ఉందని ప్రశంసించారు. గంగానికి ఈ బ్యాక్టీరియోఫేజ్‌లు ‘‘సెక్యూరిటీ గార్డులు’’గా వ్యవహరించి శుద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
డాక్టర్ సోంకర్ క్యాన్సర్, జెనటిక్ కోడ్, సెల్ బయోలజీ, ఆటోఫాగీలో ప్రపంచ స్థాయి పరిశోధనలు చేశారు. వాగెనింగెన్, రైస్, టోక్యో యూనివర్సిటీలతో కలిసి పనిచేశారు. డాక్టర్ అజయ్ సోంకర్ 2016 నోబెల్ బహుమతి గ్రహీత జపనీస్ శాస్త్రవేత్త డాక్టర్ యోషినోరి ఓహ్సుమితో కలిసి సెల్ బయాలజీ, ఆటోఫాగిపై పనిచేశారు. గంగానదిలో 1100 రకాల బ్యాక్టీరియోఫేజ్‌లు ఉన్నాయని సోంకర్ చెప్పారు. బ్యాక్టీరియోఫేజ్‌లు బ్యాక్టీరియాల కన్నా 50 రెట్లు చిన్నవైనప్పటికీ, అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాల్లోకి చొరబడి వాటి ఆర్ఎన్ఏలని హ్యాక్ చేసి, చివరకు వాటిని నాశనం చేస్తాయి. ప్రతీ ఫేజ్ వేగంగా 100-300 కొత్త వాటిని ఉత్పత్తి చేస్తాయి. ఇది దాడిని కొనసాగిస్తాయి. హానికరమైన బ్యాక్టీరియాలను తొలగిస్తాయి. సముద్రాలు మాత్రమే తమని తాము శుద్ధి చేసుకుంటాయి. ఇలాంటి లక్షణమే గంగా నదికి ఉందని పరిశోధకులు చెబుతున్నారు.