Leading News Portal in Telugu

Attack on Bangladesh air base, one dead


  • బంగ్లాదేశ్ ఎయిర్ బేస్‌పై స్థానికుల దాడి..
  • కాల్పుల్లో ఒక స్థానికుడు మృతి..
Bangladesh: బంగ్లాదేశ్ వైమానిక స్థావరంపై దాడి, ఒకరు మృతి..

Bangladesh: బంగ్లాదేశ్ కాక్స్ బజార్ జిల్లాలోని వైమానిక స్థావరంపై సోమవారం కొంత మంది నేరస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో కనీసం ఒకరు మరణించినట్లు బంగ్లాదేశ్ సైన్యం ధ్రువీకరించింది. సోర్సెస్ ప్రకారం.. బాధితుడిని 30 ఏళ్ల స్థానిక వ్యాపారి షిహాబ్ కబీర్‌గా గుర్తించారు. ఇతడిని కాల్చి చంపినట్లు సమాచారం.

బంగ్లాదేశ్ సాయుధ దళాల ప్రజా సంబంధాల విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ప్రకటన ప్రకారం.. ‘‘కాక్స్ బజార్ వైమానిక స్థావరానికి అనుకుని ఉన్న సమతి పారా నుంచి కొంతమంది నేరస్తులు కాక్స్ బజార్ వైమానిక స్థావరంపై దాడి చేశారు. ఈ విషయంలో బంగ్లాదేశ్ వైమానిక దళం అవసరమైన చర్యలు తీసుకుంటోంది’’ అని చెప్పింది.

సమాచారం ప్రకారం.. అంతకుముందు రోజు భూ వివాదం చెలరేగిన కొన్ని గంటల తర్వాత ఈ దాడి జరిగింది. ఇది వైమానిక సిబ్బందికి, స్థానిక నివాసులకు మధ్య ఘర్షణకు దారి తీసింది. స్థానికులు రాళ్లు రువ్వడంతో ఘర్షణ హింసాత్మకంగా మారింది. దీని ఫలితంగా రెండు వైపుల గాయాలయ్యాయి. అయితే, అధికారులు మాత్రం ఎంత మంది అన్నది పేర్కొనలేదు. ఈ ఘర్షణలో బాధితుడికి తుపాకీ గాయాలయ్యాయి, కాక్స్ బజార్ జిల్లాలోని సదర్ ఆస్పత్రికి మృతుడిని తీసుకువచ్చారని వైద్య వర్గాలు తెలిపాయి. ఘర్షణకు దారితీసిన కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు నిర్వహిస్తామని, నిందితులపై చర్యలు తీసుకుంటామని కాక్స్ బజార్ డిప్యూటీ కమిషనర్ మొహమ్మద్ సలావుద్దీన్ తెలిపారు.