Leading News Portal in Telugu

Pakistan Army Intensifies Operations Against Terrorists, 10 Killed in Khyber Pakhtunkhwa


Pakistan : పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఎందుకు సోమవారం బ్లాక్ డేగా మారింది ?

Pakistan : పాకిస్తానీ ఉగ్రవాదులకు సోమవారం అంటే చావుదినం లాంటిది. ఇప్పుడు సోమవారం రాగానే ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుడుతుంది. తమకు సురక్షితమైన స్థలం కోసం వెతకడం ప్రారంభించినట్లు కనిపిస్తుంది. సోమవారం పాకిస్తాన్ సైన్యానికి హంటింగ్ డేగా మారింది. సోమవారం, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో నిఘా ఆధారిత ఆపరేషన్‌లో పాకిస్తాన్ భద్రతా దళాలు 10 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. ఉగ్రవాద కార్యకలాపాల గురించి నిఘా వర్గాల సమాచారం ఆధారంగా, ఆదివారం రాత్రి నుండి సోమవారం ఉదయం మధ్య బాగ్ ప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభించి, ఉగ్రవాదులను గుర్తించి హతమార్చామని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

ఇది ఒక సోమవారంతో జరిగే విషయం కాదు.. సోమవారం రాగానే పాకిస్తాన్ సైన్యం తన క్రూరమైన వైఖరిలోకి వస్తుంది. గత సోమవారం పాకిస్తాన్ సైన్యం ఇంకా పెద్ద ఆపరేషన్ నిర్వహించింది. గత సోమవారం పాకిస్తాన్ వాయువ్య ప్రావిన్స్ పఖ్తున్ఖ్వాలో భద్రతా దళాలు పెద్ద విజయాన్ని సాధించాయి. నిఘా సమాచారం ఆధారంగా ఆపరేషన్ నిర్వహించగా అక్కడ పట్టుబడ్డ 30మంది ఉగ్రవాదులను హతమార్చారు.

2022లో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ప్రభుత్వంతో కాల్పుల విరమణను ముగించినప్పటి నుండి పాకిస్తాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. ముఖ్యంగా ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సులలో ఇటీవల ఈ కార్యకలాపాలు బాగా పెరిగాయి. ఇస్లామాబాద్‌కు చెందిన థింక్-ట్యాంక్ పాక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్ ఇటీవల విడుదల చేసిన భద్రతా నివేదిక ప్రకారం.. ఉగ్రవాద దాడులు 2014 స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. 2024లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో 95 శాతం ఈ రెండు ప్రావిన్సులలోనే కేంద్రీకృతమై ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఖైబర్ పఖ్తుంఖ్వాలో అత్యధికంగా 295 దాడులు జరిగాయి.

ఇంతలో బలూచిస్థాన్ తిరుగుబాటు గ్రూపుల దాడులు, ముఖ్యంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు 119 శాతం పెరిగాయి. బలూచిస్తాన్‌లో 171 సంఘటనలు నమోదయ్యాయి. పాక్ సైన్యం ఆపరేషన్ కు భయపడి ఉగ్రవాదులు ఇప్పుడు పొత్తులు పెట్టుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత వారు ఇతర ఉగ్రవాద సంస్థలతో కలిసి తమ దాడులను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. పెషావర్‌కు చెందిన కమాండర్ ముఫ్తీ ముజమ్మిల్ నేతృత్వంలోని ఉగ్రవాద సంస్థ హఫీజ్ గుల్ బహదూర్ (HGB) గ్రూపులో విలీనం అయ్యింది. భద్రతా సంస్థల నివేదికల ప్రకారం.. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా, ఉత్తర వజీరిస్తాన్‌లో చురుకుగా ఉన్న ఉగ్రవాద గ్రూపులలో ఇటీవలి కాలంలో చాలా ముఖ్యమైన మార్పులు వచ్చాయి. కమాండర్ ముఫ్తీ ముజమ్మిల్ ఉగ్రవాద సంస్థ హఫీజ్ గుల్ బహదూర్ నేతృత్వంలోని బృందంతో చేతులు కలిపింది. ఇది పాకిస్తాన్ సైన్యానికి సవాలుగా మారింది.