Leading News Portal in Telugu

Two Indians executed in UAE


  • వేర్వేరు హత్యా నేరాల్లో దోషులుగా ఇద్దరు భారతీయులు..
  • ఉరితీసిన యూఏఈ ప్రభుత్వం..
UAE: యూఏఈలో ఇద్దరు భారతీయులకు ఉరిశిక్ష అమలు..

UAE: వేర్వేరు హత్య కేసుల్లో దోషులుగా తేలిన ఇద్దరు భారతీయ వ్యక్తులను యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్(యూఏఈ) మరణశిక్ష విధించిందని, వారిని ఉరి తీసిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ఇద్దరు వ్యక్తుల్ని కేరళకు చెందిన మహ్మద్ రినాష్ అరంగిలోట్టు, మురళీధరన్ పెరుమ్తట్ట వలప్పిల్‌గా గుర్తించారు. యూఏఈలోని అత్యున్నత న్యాయస్థానం అయిన కాసేషన్ కోర్టు ఈ శిక్షల్ని సమర్థించిన తర్వాత వీరిద్దరిని ఉరితీసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

యూఏఈ జాతీయుడి హత్య కేసులో మహ్మద్ రినాజ్‌ని దోషిగా నిర్ధారించగా, మురళీధరన్ మరో భారతీయుడిని హత్య చేసినందుకు శిక్ష విధించింది. ఉరిశిక్షల గురించి ఫిబ్రవరి 28న యూఏఈ భారత రాయబార కార్యాలయానికి తెలియజేసింది. యూఏఈలో ఉరిశిక్ష పడిని ఇద్దర్ని రక్షించేందుకు భారత రాయబార కార్యాలయం అక్కడి ప్రభుత్వానికి క్షమాభిక్ష పిటిషన్లను పంపించి అన్ని రకాల కాన్సులర్, చట్టపరమైన సహాయాన్ని అందించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

గత నెలలో, ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన 33 ఏళ్ల యువతిని యూఏఈలో ఉరితీశారు. డిసెంబర్ 2022లో తన సంరక్షణలో ఉన్న 4 నెలల చిన్నారిని చంపిందనే అభియోగాలతో ఫిబ్రవరి 15న అబుదాబిలోని షహజాది ఖాన్‌ని ఉరితీశారు. టీకాలు వేసిన తర్వాత బిడ్డ మరణించిందని, బిడ్డ సంరక్షకురాలు షహజారి మరణానికి కారణమని బిడ్డ తల్లిదండ్రులు ఆరోపించారు.