Leading News Portal in Telugu

Indian Embassy Issues Advisory for Indians in the america


  • అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ విడుదల
  • నకిలీ కాల్స్ ఎక్కువగా వస్తుండటంతో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
  • భారతీయులు తమ ఇమిగ్రేషన్ సంబంధిత పత్రాలు అప్డేట్ చేసుకుని చట్టబద్ధంగా ఉండాలంటూ సూచన.
Indian Embassy: అమెరికాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు

Indian Embassy: అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు భారత రాయబార కార్యాలయం (Indian Embassy) ఒక ముఖ్యమైన అడ్వైజరీ విడుదల చేసింది. ఇటీవల భారత రాయబార కార్యాలయం పేరుతో నకిలీ కాల్స్ (Fraud Calls) ఎక్కువగా వస్తుండటంతో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. భారత రాయబార కార్యాలయం పేరుతో కొందరు మోసగాళ్లు భారతీయులను టార్గెట్ చేస్తున్నారని.. పాస్‌పోర్ట్, ఇమిగ్రేషన్ ఫారమ్‌, వీసాలో లోపాలున్నాయని నమ్మించి ఆ లోపాలను సరిచేసేందుకు డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపారు. అలా అడిగిన డబ్బు చెల్లించకపోతే అమెరికా నిబంధనల ప్రకారం భారత్‌కు తిరిగి పంపిస్తామని లేదా జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నట్లు వివరించింది భారత రాయబార కార్యాలయం.

అంతేకాకుండా.. ఈ మోసగాళ్లు వ్యక్తిగత సమాచారం, క్రెడిట్‌ కార్డు వివరాలు అడిగే అవకాశం ఉందని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి తమ వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దని స్పష్టం చేసింది. ఇలాంటి నకిలీ కాల్స్ వచ్చినప్పుడు భయపడకుండా వెంటనే భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించాలని సూచించింది. అమెరికాలో ఉన్న భారతీయ పౌరులతో పాటు, వీసా దరఖాస్తుదారులకు కూడా ఇలాంటి మోసపూరిత కాల్స్ వచ్చినట్లు ఫిర్యాదులు అందాయని తెలిపింది.

భారత రాయబార కార్యాలయం అధికారులు ఎవరూ వ్యక్తిగత వివరాలను ఫోన్ ద్వారా అడగరని, అధికారికంగా కేవలం “@mea.gov.in” మెయిల్ ద్వారా మాత్రమే సంప్రదిస్తారని స్పష్టం చేసింది. భారతీయులు ఈ విషయం గమనించి అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మొదటి నుంచీ అక్రమ వలసదారులపై కఠిన వైఖరి పాటిస్తున్న సంగతి తెలిసిందే. రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం, ఈ విధానాన్ని మరింత కఠినతరం చేశారు. ఈ క్రమంలో సరైన పత్రాలు లేని భారతీయులతో పాటు, ఇతర దేశీయులను కూడా అమెరికా సైనిక విమానాల ద్వారా వెనక్కి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయులు తమ ఇమిగ్రేషన్ సంబంధిత పత్రాలు అప్డేట్ చేసుకుని చట్టబద్ధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.