- ట్రంప్ విధానాల వల్ల ఎవరూ సురక్షితంగా లేరు..
- జీ7 సమావేశానికి ముందు కెనడా హెచ్చరిక..

Canada: G7 విదేశాంగ మంత్రుల సమావేశానికి కెనడా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ అమెరికాను ఉద్దేశిస్తూ జీ7 దేశాలకు హెచ్చరికల చేశారు. అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. యూరప్, బ్రిటన్ వంటి మిత్రదేశాలను హెచ్చరిస్తూ.. ‘‘అమెరికాకు అత్యంత సన్నిహితుడైన కెనడాకు ఇలా చేయగలిగితే, ఎవరూ సురక్షితంగా లేరు’’ అని ఆమె అన్నారు.
ఈ సమావేశాల ఎజెండాలో ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్, హైతీ, వెనిజులా సంఘర్షణలపై దృష్టి సారించినప్పటికీ, జోలీ అమెరికా సమస్యను కూడా లేవనెత్తాలని భావిస్తున్నారు. ఇప్పటికే అమెరికా, కెనడాపై సుంకాలను విధించింది. ఈ చర్యల నుంచి మిత్రపక్షాల నుంచి మద్దతు కూడగట్టే ప్రయత్నాలను కెనడా ప్రారంభించింది. అమెరికా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సమిష్టి చర్యల అవసరాలను ఆమె హైలెట్ చేశారు.
డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, కెనడాపై సుంకాలతో విరుచుకుపడ్డారు. పలు సందర్భాల్లో కెనడా అమెరికాలో 51వ రాష్ట్రంగా మారాలని, అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో గవర్నర్‌గా ఉండాలంటూ ట్రంప్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఇరు దేశాలు మధ్య టారిఫ్ వార్ జరుగుతోంది. అమెరికా కెనడా అల్యుమినియం, స్టీల్‌పై 25 సుంకం విధించింది. కెనడా కూడా దాదాపుగా 20 బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ వస్తువులపై టారిఫ్ విధించింది.