Leading News Portal in Telugu

Pakistan’s Foreign Office Accuses India Of Being Behind Balochistan Train Hijack


  • బలూచిస్తాన్ ట్రైన్ హైజాక్ వెనక భారత్ హస్తం..
  • పాకిస్తాన్ సంచలన ఆరోపణలు..
  • ఆఫ్ఘన్ నుంచి బీఎల్ఏకి సాయం చేస్తున్నారని వాదన..
Pakistan Train Hijack: ట్రైన్ హైజాక్ వెనక భారత్ హస్తం.. పాక్ సంచలన ఆరోపణ..

Pakistan Train Hijack: పాకిస్తాన్‌లోని అతిపెద్ద ప్రావిన్స్ బెలూచిస్తాన్‌లో ‘‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’’ హైజాక్‌కి గురైంది. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న రైలుని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ఫైటర్స్ హైజాక్ చేశారు. అయితే, ఈ ఘటన వెనక భారతదేశ హస్తముందని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం గురువారం ఆరోపించింది. ఈ హైజాక్‌లో 21 మంది ప్రయాణికులు, నలుగురు పారామిలిటరీ సైనికులు బలూచ్ ఫైటర్స్ చేతిలో మరణించారు.

విదేశాంగ కార్యాలయ ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హైజాక్ వెనక ఉన్న బలూచ్ ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్థాన్‌లోని వారి సహచరులతో సంప్రదింపులు జరుపుతున్నారని నిఘా నివేదికలు సూచించాయని చెప్పారు. భారత్ పేరు నేరుగా ప్రస్తావించకుండా, భారత్ హస్తముందనే రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారు. బీఎల్ఏ వంటి సంస్థలు దాని సరిహద్దుల్లో పనిచేయకుండా నిరోధించాలని పాక్ పదేపదే ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన చెప్పారు. జాఫర్ ఎక్స్‌ప్రెస్ దాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైందని చెప్పారు.

మరోవైపు, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సలహాదారు రాణా సనావుల్లా మాట్లాడుతూ.. ఈ హైజాక్‌లో భారత ప్రమేయం ఉందని ఆరోపించారు. భారత్ ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఈ దాడుల్ని నిర్వహిస్తోందని నిందించారు. డాన్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సనావుల్లా ఈ ఆరోపణలు చేశారు. భారత్ తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) మరియు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) రెండింటికీ మద్దతు ఇస్తోందని అన్నారు.

పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ.. భద్రతా దళాలు సంఘటన స్థలంలో ఉన్న 33 మంది ఉగ్రవాదులను హతమార్చాయని, మంగళవారం ఉగ్రవాదులు రైలుపై దాడి చేసినప్పుడు 21 మంది ప్రయాణికులను చంపారని అన్నారు. 450 మంది ప్రయాణికులతో వెళ్తున్న జఫర్ ఎక్స్‌ప్రెస్‌ని బెలూచిస్తాన్‌లోని సెబి జిల్లా మారుమూల ప్రాంతంలో బీఎల్ఏ అదుపులోకి తీసుకుంది. పాక్ ప్రకారం, ఈ ఘటనలో 70-80 మంది ఉగ్రవాదులు పాల్గొన్నారు.