Leading News Portal in Telugu

Another attack on Hindu temple in Bangladesh


  • బంగ్లాదేశ్‌లో మరోసారి హిందూ ఆలయంపై దాడి
  • విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు
  • పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ సాహా తెలిపారు
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరోసారి హిందూ ఆలయంపై దాడి.. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

గత కొంతకాలంగా బంగ్లాదేశ్ లో హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. హిందూ మైనారిటీలను ముస్లిం మెజారిటీ జనాభా లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహ్మద్ యూనస్ దేశంలో శాంతి భద్రతలు గాడిలో ఉన్నాయని చెబుతున్నప్పటికీ, అక్కడ హిందువులపై దాడులు ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి హిందూ దేవాలయంపై దాడి జరిగింది. లక్ష్మీపూర్ జిల్లాలోని రాయ్‌పూర్‌లోని మురిహట ప్రాంతంలోని శ్రీ శ్రీ మహామాయ ఆలయంలో ముసుగులు ధరించిన దుండగులు మహామాయ దేవి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. హోలీ పండగ వేళ ఈ సంఘటన చోటుచేసుకుంది.

హోలీ పండుగ రోజు గురువారం సాయంత్రం ప్రార్థనలు ముగిసిన తర్వాత పూజారులు ఆలయం నుంచి వెళ్లిపోయారని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ సాహా తెలిపారు. మరుసటి రోజు పూజారి ఆలయానికి తిరిగి వచ్చినప్పుడు, దేవత విగ్రహం విరిగిపోయి, దెబ్బతిన్నట్లు కనిపించడంతో షాక్ అయ్యాడు. ఆలయంపై దాడి జరిగిందని గుర్తించిన పూజారి స్థానిక హిందూ సంఘానికి ఫోన్ చేసి జరిగిన సంఘటన గురించి తెలియజేశాడు. ఈ దారుణ ఘటన అక్కడ ఏర్పాటు చేసిన CCTV కెమెరాలో రికార్డైంది. ముసుగు ధరించిన ఒక వ్యక్తి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి, విగ్రహాన్ని ధ్వంసం చేసి, ఆపై పారిపోతున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది.

ఈ సంఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ సాహా తెలిపారు. ఈ సంఘటనకు కారణమైన వారిని గుర్తించి 24 గంటల్లోగా అరెస్టు చేయాలని లక్ష్మీపూర్ పూజ ఉత్సవ్ పరిషత్ డిమాండ్ చేసింది. సమాచారం అందుకున్న రాయ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి నిజాం ఉద్దీన్ భూయాన్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన చెప్పారు.