- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం
- వలసలపై కఠిన చర్యలు
- 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్
- ఈ లిస్ట్ లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, ఇతర దేశాలు ఉన్నాయి

దేశాలపై సుంకాలతో ట్రేడ్ వార్ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించడానికి సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ లిస్ట్ లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, ఇతర దేశాలు ఉన్నాయి. వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ట్రంప్ సర్కార్ మొత్తం 41 దేశాలతో మూడు జాబితాలను సిద్ధం చేసిందని తెలిపింది. మొదటి జాబితాలో 10 దేశాలు చేర్చబడ్డాయని, ఇందులో ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాన్, క్యూబా, ఉత్తర కొరియా వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాల పౌరులు అమెరికాకు వెళ్లలేరు. వీటన్నింటిపై పూర్తి నిషేధం ఉంటుంది.
రెండవ లిస్ట్ లో తూర్పు ఆఫ్రికా దేశాలు ఎరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్ ఉన్నాయి. ఈ దేశాల పౌరులకు పాక్షిక సస్పెన్షన్ వర్తిస్తుంది. ఇది పర్యాటక, స్టూడెంట్ వీసాలతో పాటు కొన్ని మినహాయింపులతో ఇతర వలస వీసాలను కూడా ప్రభావితం చేస్తుంది. అమెరికా 26 దేశాలను మూడవ గ్రూపులో చేర్చింది. జాబితాలోని అన్ని పేర్లను వెల్లడించకపోయినా.. అందులో పాకిస్తాన్, భూటాన్, మయన్మార్ వంటి దేశాలు ఉన్నాయి. ట్రావెల్ బ్యాన్ ఉన్న ప్రభుత్వాలు 60 రోజుల్లోపు లోపాలను సరిచేసే ప్రయత్నాలు చేయకపోతే US వీసాలు జారీ చేయడంపై పాక్షిక నిషేధాన్ని విధించేందుకు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ జాబితా ఫైనల్ కాదు. ఇందులో మరికొన్ని దేశాలను చేర్చవచ్చు లేదా తొలగించవచ్చు. జాబితాపై తుది నిర్ణయం ట్రంప్ సర్కార్ తీసుకోనుంది. డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీకాలంలో 7 ముస్లిం దేశాలపై ప్రయాణ నిషేధం విధించారు. ఇప్పుడు ట్రంప్ తన రెండవ పదవీకాలంలో కూడా దీనిని కొనసాగించారు. ట్రంప్ వలసలపై కఠిన చర్యలు తీసుకుంటూ మార్చి 21 నాటికి ఏ దేశాల నుంచి ప్రయాణాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా నిలిపివేయాలో ఒక జాబితాను అందించాలని క్యాబినెట్ సభ్యులను ఆదేశించారు.