Leading News Portal in Telugu

US airstrikes on Houthi rebels


  • హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా వైమానిక దాడులు
  • ఇరాన్‌ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు
  • హౌతీ పొలిటికల్ బ్యూరో ఈ దాడులను “యుద్ధ నేరాలు”గా అభివర్ణించింది
Trump: హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా వైమానిక దాడులు.. 19 మంది మృతి

యెమెన్‌లో ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా వరుస దాడులకు పాల్పడింది. హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం కొనసాగిస్తున్న దృష్ట్యా అమెరికా ఈ చర్య తీసుకుంది. యెమెన్ రాజధాని సనాపై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో 19 మంది మరణించగా, తొమ్మిది మంది గాయపడ్డారని హౌతీల ఆధీనంలో ఉన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

హౌతీ పొలిటికల్ బ్యూరో ఈ దాడులను “యుద్ధ నేరాలు”గా అభివర్ణించింది. ఉత్తర ప్రావిన్స్ సాదాలో అమెరికా దాడులు కొనసాగుతున్నాయని తెలిపింది. పెరుగుతున్న ఉద్రిక్తతలను ఎదుర్కొనేందుకు యెమెన్ సాయుధ దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని ఒక ప్రకటనలో తెలిపింది. హౌతీ తిరుగుబాటుదారులు తమ దాడులను ఆపకపోతే, “మునుపెన్నడూ చూడని విధంగా నరకం” ఉంటుందని అమెరికా హెచ్చరించింది. హౌతీ తిరుగుబాటుదారులకు మద్దతు ఇస్తున్న ఇరాన్‌ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇకపై తిరుగుబాటుదారులకు మద్దతు ఇవ్వడం ఆపేయాలని హెచ్చరించాడు.

యెమెన్ రాజధాని సనాపై శనివారం వైమానిక దాడులకు ఆదేశించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. హౌతీ తిరుగుబాటుదారులు సముద్ర కారిడార్‌ను లక్ష్యంగా చేసుకోవడం ఆపే వరకు మేము మా దాడులను కొనసాగిస్తాము అని ఆయన అన్నారు. “ప్రపంచ జలమార్గాల గుండా అమెరికన్ వాణిజ్య, నావికాదళ నౌకలు స్వేచ్ఛగా కదలకుండా ఏ ఉగ్రవాద సంస్థ కూడా నిరోధించలేదు” అని ట్రంప్ ఇంటర్నెట్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. గత దశాబ్దంలో యెమెన్‌లో ఎక్కువ భాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న సాయుధ ఉద్యమమైన హౌతీలు, నవంబర్ 2023 నుండి షిప్పింగ్‌ను లక్ష్యంగా చేసుకుని 100 కి పైగా దాడులను నిర్వహించారు. ఇది ప్రపంచ వాణిజ్యానికి అంతరాయం కలిగించింది.