- కెనడా ప్రభుత్వంలో మంత్రులుగా భారత సంతతికి చెందిన మహిళలు
- కమల్ ఖేడా, అనితా ఆనంద్ లకు చోటు

కెనడా 24వ ప్రధానిగా మార్క్ కార్నీ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా కెనడా కేబినెట్ కొలువుదీరింది. కెనడా ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన ఇద్దరు మహిళలకు చోటుదక్కింది. కెనడియన్ పౌరురాలు అనితా ఆనంద్, ఢిల్లీలో జన్మించిన కమల్ ఖేడా కెనడియన్ పార్లమెంటుకు ఎన్నికైన అతి పిన్న వయస్కులైన మహిళలు వీరే. అనిత (58) ఇన్నోవేషన్, సైన్స్, పరిశ్రమల శాఖ మంత్రిగా, కమల్ (36) ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మాజీ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మంత్రివర్గం నుంచి వేర్వేరు మంత్రిత్వ శాఖలతో తమ మంత్రి పదవులను నిలుపుకున్న కొద్దిమందిలో ఇద్దరూ ఉన్నారు.
కమల్ ఖేడా చదువుకుంటున్న సమయంలో ఆమె కుటుంబం కెనడాకు వెళ్లింది. తరువాత ఆమె టొరంటోలోని యార్క్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు.కెనడా ప్రధాన మంత్రి వెబ్‌సైట్ ప్రకారం.. కమల్ ఖేడా మొదటిసారి 2015లో బ్రాంప్టన్ వెస్ట్ నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. పార్లమెంటుకు ఎన్నికైన అతి పిన్న వయస్కురాలైన మహిళల్లో ఆమె ఒకరు. రిజిస్టర్డ్ నర్సు, కమ్యూనిటీ వాలంటీర్, రాజకీయ కార్యకర్త అయిన కమల్ ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.
కమల్ ఖేడా టొరంటోలోని సెయింట్ జోసెఫ్ హెల్త్ సెంటర్‌లో ఆంకాలజీ విభాగంలో నర్సుగా పనిచేశారు. “ఒక నర్సుగా.. రోగులకు ఎల్లప్పుడూ అండగా ఉండటమే నా అతిపెద్ద ప్రాధాన్యత. నేను ఆరోగ్య మంత్రిగా ఉన్నా అలాగే పని చేస్తాను. ప్రధాన మంత్రి మార్క్ కార్నీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని కమల్ తెలిపింది.
కెనడా ప్రధాన మంత్రి వెబ్‌సైట్ ప్రకారం.. అనితా ఆనంద్ మొదటిసారిగా 2019లో ఓక్‌విల్లే పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. గతంలో ట్రెజరీ బోర్డు అధ్యక్షురాలిగా, జాతీయ రక్షణ మంత్రిగా, ప్రజా సేవలు, సేకరణ మంత్రిగా పనిచేశారు. “అనితా ఆనంద్ ఒక స్కాలర్, న్యాయవాది, పరిశోధకురాలిగా పనిచేశారు. ఆమె టొరంటో విశ్వవిద్యాలయంలో లా ప్రొఫెసర్‌గా న్యాయ విద్యావేత్తగా ఉన్నారు. కార్నీ మంత్రివర్గంలో 13 మంది పురుషులు, 11 మంది మహిళలు ఉన్నారు. ఇది ట్రూడో 37 మంది సభ్యుల బృందం కంటే చిన్నది. ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత ప్రధాన మంత్రి కార్నీ తన మంత్రివర్గ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.