- ట్రంప్ నా కోసం భద్రతను పక్కన పెట్టారు..
- లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోడీ..
- ‘‘హౌడీ మోడీ’’ కార్యక్రమాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని..

PM Modi: అమెరికన్ పాడ్‌కాస్టర్, ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్రమోడీ కీలక విషయాలను వెల్లడించారు. హ్యూస్టన్‌లో జరిగిన ‘‘హౌడీ మోడీ’’ కార్యక్రమం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భద్రతను పక్కన పెట్టారని అన్నారు. వేల సంఖ్యలో ప్రవాస భారతీయులు హాజరైన తీరును మోడీ గుర్తు చేసుకున్నారు. మోడీ తన ప్రసంగం ముగిసిన తర్వాత, ట్రంప్‌తో కలిసి స్టేడియంలో తిరగడం గురించి చెప్పారు.
‘‘ నేను అతనికి కృతజ్ఞతలు చెప్పడానికి అతని దగ్గరికి వెళ్ళాను, మీకు అభ్యంతరం లేకపోతే మనం స్టేడియం చుట్టూ ఒక రౌండ్ ఎందుకు తిరగకూడదు అని మామూలుగా అన్నాను’’ అని ట్రంప్‌తో అన్నానని మోడీ చెప్పారు. అందుకు ట్రంప్ ‘‘ఇక్కడ చాలా మంది ఉన్నారు. మనం కలిసి నడుద్దాం, వారిని పలకరిద్దాం అని చెప్పినట్లు మోడీ వెల్లడించారు. అమెరికా కఠినమైన భద్రతా ప్రోటోకాల్‌లో ఇలాంటి తీరు అసాధారణమని మోడీ చెప్పారు. అమెరికన్ సమాజంలో వేలాది మంది ప్రజల సమక్షంలో ప్రెసిడెంట్ ఇలా తిరగడం అసాధ్యమని చెప్పారు.
ట్రంప్ ఏ మాత్రం సంకోచించకుండా, తన మాటను అంగీకరించి స్టేడియంలో తిరగడం ప్రారంభించినట్లు మోడీ వెల్లడించారు. ఇది ట్రంప్ భద్రతా సిబ్బందిని ఆశ్చర్యపరిచిందని చెప్పారు.‘‘ఆ క్షణం నా మనసును తాకిందని, అది అతడి ధైర్యాన్ని చూపించింది’’ అని అన్నారు. గతేడాది అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ఎన్నికల ప్రచారంలో హత్యాయత్నం గురంచి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘ అమెరికా ఎన్నికలకు ముందు ఇటీవల జరిగిన ప్రచారంలో ట్రంప్‌కు కాల్పులు జరిగినప్పుడు, ఆ స్టేడియంలో నాతో చేయి చేయి కలిపి నడిచిన అదే దృఢ సంకల్పం కలిగిన అధ్యక్షుడు ట్రంప్‌ను నేను చూశాను’’ అని మోడీ అన్నారు.
‘‘ బుల్లెట్ తాకిన తర్వాత కూడా, ఆయన అమెరికాకు అచంచలంగా అంకితభావాన్ని ప్రదర్శించాడు. అతడి జీవితం దేశం కోసమే. నేను భారతదేశాన్ని నమ్మినట్లే, అతడు అమెరికా స్ఫూర్తిని చూపించారు. నేను భారత్ ఫస్ట్ అని అనుకుంటాను. అందుకే మేము కనెక్ట్ అయ్యాము.’’ అని మోడీ చెప్పారు. జూలై13న పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ దాడిలో తృటిలో ట్రంప్ ప్రాణాలు దక్కాయి.