- సునీతా విలియమ్స్ రాకపై నాసా కీలక ప్రకటన
- మంగళవారం సాయంత్రం భూమ్మీదకు రానున్నట్లు వెల్లడి

నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహోద్యోగి బుచ్ విల్మోర్ అంతరిక్ష యాత్ర ముగిసింది. తొమ్మిది నెలల అంతరిక్ష యాత్ర మరికొన్ని గంటల్లో ముగియనుంది. కొన్ని గంటల్లోనే భూమికి చేరుకోనున్నారు. ఈ మేరకు నాసా కీలక ప్రకటన విడుదల చేసింది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు భూమ్మీదకు చేరుకోనున్నారు. సునీత, విల్మోర్‌ను తీసుకొచ్చేందుకు రోదసిలోకి వెళ్లిన స్పేస్‌ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూ కక్ష్యలోకి చేరుకుంది. క్రూ-10 మిషన్‌లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది.
ఇది కూడా చదవండి: Anupama : మళ్ళీ అదే హీరోతో జతకడుతున్న అనుపమ
క్రూ డ్రాగన్ వ్యోమనౌక తిరుగు పయనం సోమవారం రాత్రి 10.45 గంటలకు మొదలుకానుంది. ఇక మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్ దిగనుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారని నాసా వెల్లడించింది. సునీత, విల్మోర్‌తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు కూడా భూమ్మీదకు రానున్నారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్’లో సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం వారం రోజులకే సునీత, విల్మోర్ భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే తిరిగి భూమికి వచ్చేసింది. అప్పటి నుంచి సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌లోనే చిక్కుకుపోయారు. ఎట్టకేలకు మరికొన్ని గంటల్లో సునీతా విలియమ్స్ మాతృభూమిని ముద్దాడనున్నారు.
ఇది కూడా చదవండి: Telangana Assembly: నేడు శాసన సభలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లులను ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం..