Leading News Portal in Telugu

israel says conducting extensive strikes in gaza


  • గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు
  • 66 మంది మృతి.. పలువురికి గాయాలు
  • ఇటీవలే ముగిసిన కాల్పుల విరమణ తొలి ఒప్పందం
Israel-Gaza: గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు.. 66 మంది మృతి

ఇజ్రాయెల్-హమాస్ మధ్య పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. ఏడాదికి పైగా గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన యుద్ధం సాగించింది. అయితే జనవరి 19న అంతర్జాతీయ మధ్యవర్తుల చర్చలతో కాల్పుల విరమణకు ఒప్పందం జరిగింది. ఈ సమయంలో ఖైదీ-బందీల మార్పిడి జరిగింది. ఇటీవల ఈ ఒప్పందం గడువు ముగిసింది. అయితే ఈ ఒప్పందాన్ని కొనసాగించాలని ఇజ్రాయెల్ కోరింది. అందుకు హమాస్ ససేమిరా అంది. దీంతో పరిస్థితులు మళ్లీ మొదటికే వచ్చాయి. కాల్పుల విరమణ ముగియడంతో సోమవారం ఇజ్రాయెల్ దళాలు… హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై భీకరమైన దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 66 మంది చనిపోయారు. అలాగే దక్షిణ సిరియాపై కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. 19 మంది గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 66 మంది చనిపోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రంజాన్ మాసంలో ఐడీఎఫ్ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 70 మంది గాయపడ్డారని గాజా పౌర రక్షణ సంస్థ తెలిపింది.

హమాస్ అంతమే లక్ష్యంగా ఉగ్రవాద స్థావరాలపై విస్తృతమైన దాడులు నిర్వహించినట్లు ఐడీఎఫ్ ఎక్స్ ట్విట్టర్‌లో పేర్కొంది. ఇక ఈ దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా స్పందించారు. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసేందుకు పదే పదే హమాస్ నిరాకరించిందని.. అలాగే అమెరికా అధ్యక్ష రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, అంతర్జాతీయ మధ్యవర్తుల పంపిన అన్ని ప్రతిపాదనలను హమాస్ తిరస్కరించిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే హమాస్ అంతమే లక్ష్యంగా తాము దాడులు నిర్వహించనట్లు నెతన్యాహు పేర్కొన్నారు.

సెంట్రల్ గాజాలోని దేర్ అల్-బలాలో మూడు ఇళ్లు, గాజా నగరంలోని ఒక భవనం, ఖాన్ యూనిస్ మరియు రఫాలో ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమైనట్లు నివేదికలు అందుతున్నాయి. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ చర్యలను హమాస్ ఖండించింది. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని తెలిపింది. దీనికి పూర్తి బాధ్యత నెతన్యాహునే వహించాలని హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ చర్చలు నిలిచిపోయాయి. మూడు దశల కాల్పుల విరమణ ఒప్పందంలోని మొదటి దశను పొడిగించాలని ఇజ్రాయెల్ కోరుకోగా అందుకు హమాస్ అంగీకరించలేదు. మార్చి 2న ప్రారంభం కానున్న రెండవ దశలో మాత్రమే బందీలను విడుదల చేస్తామని హమాస్ తెలిపింది. రెండో దశలో అమెరికన్-ఇజ్రాయెల్ సైనికుడు ఎడాన్ అలెగ్జాండర్ మరియు నలుగురు బందీల మృతదేహాలను విడుదల చేయడానికి అంగీకరించినట్లు గత వారం హమాస్ తెలిపింది. అయితే బందీల పట్ల హమాస్ క్రూరంగా ప్రవర్తిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపించింది.

2023 అక్టోబర్ 7న హమాస్.. దక్షిణ ఇజ్రాయెల్‌పై దాడి చేసి ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా తీసుకెళ్లారు. అప్పటి నుంచి పగతో ఇజ్రాయెల్ రగిలిపోయింది. భీకరదాడులు చేసింది. దీంతో వందలాది మంది పాలస్తీనియులు చనిపోయారు.