Leading News Portal in Telugu

US President Trump spoke on the phone with Ukrainian President Zelensky


  • జెలెన్‌స్కీకి ట్రంప్ ఫోన్
  • తాత్కాలిక కాల్పుల విరమణకు ఉక్రెయిన్-రష్యా అంగీకారం!
Trump-Zelensky: జెలెన్‌స్కీకి ట్రంప్ ఫోన్.. తాత్కాలిక కాల్పుల విరమణకు ఉక్రెయిన్-రష్యా అంగీకారం!

ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న మూడేళ్ల యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ సంభాషించారు. కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చించారు. కానీ పుతిన్ మాత్రం కొన్ని షరతులు విధించారు. ఇక బుధవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కూడా ట్రంప్ గంట సేపు చర్చించారు. ఇటీవల వైట్‌హౌస్‌లో జరిగిన హాట్‌హాట్ సమావేశం తర్వాత.. బుధవారం ట్రంప్-జెలెన్‌స్కీ మధ్య చాలా కూల్‌గా సంభాషణ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా జెలెన్‌స్కీకి పలు హామీలు ఇచ్చినట్లుగా సమాచారం. తాత్కాలిక కాల్పుల విరమణకు రష్యా-ఉక్రెయిన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందానికి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారని వైట్‌హౌస్ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Daksha Nagarkar : తళుకుమన్నది కుళుకుల తార..

ఇదిలా ఉంటే కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా మొదటి షరతు.. ఇంధనం, ఇతర పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయకూడదని నిర్ణయం తీసుకున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే.. ఓ వైపు చర్చలు నడుస్తుండగానే ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరుపక్షాలు దాడులు చోటుచేసుకున్నాయి. అయితే రష్యానే ఉల్లంఘించిందని ఉక్కెయిన్ ఆరోపిస్తుంటే.. ఉక్రెయినే ఉల్లంఘించిందంటూ రష్యా ఆరోపించింది.

ఇక జెలెన్‌స్కీతో ట్రంప్ చర్చల్లో భాగంగా అమెరికా-ఉక్రెయిన్ ఖనిజాల ఒప్పందం గురించి కూడా చర్చించినట్లు సమాచారం. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. అమెరికా ఖనిజాల ఒప్పందానికి అతీతంగా ఉందని.. శాంతి చర్చలపైనే ఎక్కువ దృష్టి సారించినట్లు తెలిపారు. ఇక రష్యా అపహరణలో ఉన్న ఉక్రెయిన్ పిల్లలను తిరిగి తీసుకొచ్చేందుకు జెలెన్‌స్కీకి ట్రంప్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Punjab: శంభు సరిహద్దులో రైతుల దీక్ష భగ్నం.. అన్నదాతల అరెస్ట్

ఇక ట్రంప్‌తో ఫోన్ సంభాషణపై జెలెన్‌స్కీ కీలక ప్రకటన చేశారు. చాలా సానుకూల సంభాషణ జరిగినట్లుగా తెలిపారు. స్పష్టమైన సంభాషణ జరిగినట్లుగా పేర్కొన్నారు. ట్రంప్‌తో ఫోన్ సంభాషణ తర్వాత ఈ వారం సౌదీ అరేబియాలో పాక్షిక కాల్పుల విరమణకు సంబంధించిన సాంకేతిక చర్చలు జరుగుతాయని జెలెన్‌స్కీ ధృవీకరించారు. అయితే పుతిన్… ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని నిలిపివేయాలని షరతుల జాబితాను సమర్పించారు. వీటిని జెలెన్‌స్కీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రష్యన్ దళాలు ఆక్రమించిన ఏ భూమిని ఉక్రెయిన్ వదులుకోవడానికి సిద్ధంగా లేదని జెలెన్‌స్కీ తేల్చిచెప్పారు. మొత్తానికి సౌదీ అరేబియా వేదికగా తాత్కాలిక కాల్పుల విరమణకు చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల తర్వాత 30 రోజులు తాత్కాలిక కాల్పులకు విరమణ దొరకనుంది.

ఇది కూడా చదవండి: Off The Record : విజయనగరం ఎంపీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారా? ఆ నేత చేష్టలు ఎబ్బెట్టుగా ఉంటున్నాయా?