Leading News Portal in Telugu

ట్రంప్ వచ్చేశాడోచ్ .. 12న ఏం జరగబోతోంది..!

ప్రపంచ దేశాలన్నీ ఎప్పుడప్పుడా అని ఎదురు చూస్తున్న కిమ్-ట్రంప్ భేటీకి కౌంట్‌డౌన్ మొదలయ్యింది. జూన్ 12న జరగనున్న సమావేశంలో పాల్గొనేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు ఆదివారం ఉదయం సింగపూర్ చేరుకోగా.. కొద్ది గంటల తర్వాతే ట్రంప్ కూడా ఎంట్రీ ఇచ్చారు. కెనడాలో జరుగుతున్న జీ7 సదస్సు నుంచి నేరుగా ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడికి సింగపూర్ విదేశాంగశాఖ మంత్రి బాలకృష్ణన్‌ ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్ నుంచి పటిష్టమైన భద్రత మధ్య హోటల్‌కు వెళ్లారు. కిమ్‌తో భేటీపై ట్రంప్ స్పందించారట. ఈ సమావేశంపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే.. వెరీ గుడ్ అంటూ సమాధానం ఇచ్చారట.

ఈ నెల 12 (మంగళవారం) వీరిద్దరూ సింగపూర్‌లోని సెంటోజా ఐలాండ్ రిసార్ట్‌లో జరగనుంది. సుమారు 65 ఏళ్ల కిందట అంటే 1953లో అనేక ఘర్షణలు, వివాదాల అనంతరం కొరియా యుద్ధం అధికారికంగా ముగిసింది. ఈ యుద్ధం తర్వాత ఉత్తర కొరియా అధినేత అమెరికా అధ్యక్షుడితో ప్రత్యేకంగా భేటీ కావడం ఇదే తొలిసారి కాగా.. కిమ్‌ వైఖరి నచ్చకపోతే మధ్యలోనే వెళ్లిపోతానంటూ.. మీటింగ్‌ పార్ట్‌నర్‌కు ట్రంప్‌ హెచ్చరికలు ముందే పంపించేశారు. మరి మంగళవారం భేటీ ఎలా జరగబోతుందోనని అందరిలో ఉత్కంఠ రేపుతోంది.