Leading News Portal in Telugu

అణువిపత్తు లేదిక!

వాషింగ్టన్‌: ఉత్తరకొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో సింగపూర్‌లో జరిగిన భేటీ అసాధారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ భేటీ కారణంగా భారీ అణు విపత్తునుంచి ప్రపంచం ఒక అడుగు వెనక్కు వేయగలిగిందన్నారు. తన దేశప్రజల శ్రేయస్సు దిశగా ధైర్యంగా తొలి అడుగు వేసిన కిమ్‌కు ట్రంప్‌ కృతజ్ఞతలు తెలిపారు. ‘చైర్మన్‌ కిమ్‌కు కృతజ్ఞతలు. అసాధారణమైన భేటీ ఇది. మార్పు సాధ్యమేనని ఈ సమావేశం ద్వారా స్పష్టం చేసింది. తన ప్రజలకు మేలు చేసే దిశగా కిమ్‌ ధైర్యంగా ఓ అడుగు ముందుకేశారు.

ప్రపంచం ఓ భారీ అణువిపత్తు నుంచి ఓ అడుగు వెనక్కు వేసింది’ అని సదస్సు ముగించుకుని వెళ్తూ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ‘ఇకపై రాకెట్‌ ప్రయోగాలు, అణు పరీక్షలు, పరిశోధనలు జరగవు. బందీలుగా ఉన్న వారు స్వదేశాలకు చేరుకున్నారు. చైర్మన్‌ కిమ్‌కు ధన్యవాదాలు. మనం భేటీ అయిన ఈ రోజు చరిత్రాత్మకం. ఉత్తరకొరియా ఇకపై అమెరికాకు ఓ హెచ్చరిక కాబోదు’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ట్రంప్‌తో సమావేశం సందర్భంగా మూడో ప్రయోగ కేంద్రాన్నీ (మిసైల్‌ ఇంజిన్‌ల ప్రయోగ కేంద్రం) ధ్వంసం చేసేందుకు కిమ్‌ అంగీకరించారు.

మిసైల్‌ ఇంజిన్‌ పరీక్ష కేంద్రంతో పాటు మిగిలిన క్షిపణి కేంద్రాలను ధ్వంసం చేసే ప్రణాళికలను కిమ్‌ త్వరలో వెల్లడిస్తారని ట్రంప్‌ పేర్కొన్నారు. ‘అణ్వాయుధాలు ఇకపై ఉండబోవని కిమ్‌ తెలిపారు. వీలైనంత త్వరగా ఈ కార్యాచరణ ఉంటుందన్నారు. మేం ఆయనకు భద్రతాపరమైన భరోసా ఇచ్చాం. దీనిపై కిమ్‌ సంతోషంగా ఉన్నారు’ అని ట్రంప్‌ అన్నారు. దక్షిణ కొరియాలోనూ ఇకపై అమెరికా సైనిక విన్యాసాలు ఉండబోవని స్పష్టం చేశారు.

పరిమితుల్లేని పురోగతి
అణ్వాయుధాలను త్యజించిన తర్వాత ఉత్తరకొరియా సాధించే ప్రగతికి పరిమితుల్లేవని.. ప్రపంచంతో వాణిజ్య బంధాలను బలోపేతం చేసుకున్న తర్వాత పురోగతి పరుగులు పెడుతుందని ట్రంప్‌ పేర్కొన్నారు. ‘ఉత్తరకొరియా పౌరుల భద్రత, వారి శ్రేయస్సు కోసం సరికొత్త శకంలోకి అడుగుపెట్టనున్న నేపథ్యంలో వారి నేతగా కిమ్‌ ఎప్పటికీ గుర్తుండిపోతారు. సింగపూర్‌ పర్యటనను నేనెప్పటికీ మరువలేను.

ఉత్తరకొరియాలో అణ్వాయుధ నిరాయుధీకరణ విషయంలో భారీ ముందడుగు పడింది’ అని ట్రంప్‌ వెల్లడించారు. మరోవైపు, అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పోంపియో దక్షిణ కొరియా, చైనా పర్యటనకు బయలుదేరారు. కిమ్‌తో ట్రంప్‌ సమావేశ వివరాలను ఈ దేశాల అధినేతలతో ఆయన పంచుకోనున్నారు. 2020 కల్లా ఉత్తరకొరియా పూర్తిగా నిరాయుధీకరణ చేస్తుందని పోంపియో వెల్లడించారు.

ప్యాంగ్యాంగ్‌కు రండి
చారిత్రక సింగపూర్‌ సదస్సు సందర్భంగా తమ దేశానికి రావాలంటూ ట్రంప్‌ను కిమ్‌ ఆహ్వానించారు. ఇందుకు ట్రంప్‌ అంగీకరించారని ఉత్తర కొరియా మీడియా (కేసీఎన్‌ఏ) ప్రకటించింది. ‘అణ్వాయుధ దేశాలు, ప్రచ్ఛన్నయుద్ధ శత్రువుల మధ్య ఓ అద్భుతమైన మార్పుకు నాంది’గా ఈ సమావేశాన్ని అభివర్ణిస్తూ బుధవారం కథనాన్ని వెలువరించింది. ఉభయ కొరియాల సరిహద్దుల్లో సైనిక విన్యాసాలను నిలిపివేసేందుకు ట్రంప్‌ అంగీకరించారని ఈ కథనం పేర్కొంది. ‘కొరియా ద్వీపకల్పంలో శాంతి, స్థిరత్వం నెలకొల్పడంతోపాటు అణునిరాయుధీకరణకోసం ఇరుదేశాలు శత్రుత్వం నుంచి బయటకు వచ్చి పరస్పర అవగాహనతో ముందుకెళ్లాలి’ అని కిమ్‌ పేర్కొన్నట్లు కేసీఎన్‌ఏ వెల్లడించింది.