కరోనావైరస్: బయటకు వస్తే మాస్కులు ధరించాల్సిందే… నిబంధనలు కఠినతరం చేసిన ప్రభుత్వం
వాషింగ్టన్ : కరోనావైరస్ అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేసింది. ఇప్పటివరకు ఆదేశంలో 7వేలకు పైగా మృత్యువాత పడ్డారు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనావైరస్ మాత్రం కట్టడి కావడం లేదు. 24 గంటల సమయంలోనే 1500 మంది చనిపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి చేదాటి పోతుండటంతో అమెరికా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లిన సమయంలో మాస్కులు ధరించాలనే నిబంధన తీసుకొచ్చింది. కేవలం శ్వాస తీసుకోవడం వల్లే కరోనావైరస్ సోకుతుందనే విషయాన్ని పరిశోధకులు చెప్పడంతో ఈ నిబంధన తీసుకొచ్చింది ట్రంప్ సర్కార్
ఇక ఈ మహమ్మారి పుట్టిన చైనాలో కొన్ని వేల మంది చనిపోయారు. వారందరి ఆత్మకు శాంతి చేకూరాలని చైనా శుక్రవారం రోజున జాతీయ సంతాప దినం పాటించింది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 60వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో యూరోప్ దేశాల్లోనే మరణాలు సింహభాగంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇటలీ, స్పెయిన్‌లలో అయితే మరణాల సంఖ్య ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉంది. ఇక అమెరికాలో అయితే పరిస్థితి చేయి దాటి పోతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ట్రంప్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇలా చేయడంవల్ల వ్యాప్తిని కాస్తఅయినా తగ్గించొచ్చని భావిస్తోంది. మాస్కులు ధరించడం ప్రతిఒక్కరూ స్వచ్చందంగా పాటించాలని ట్రంప్ పిలుపునిచ్చారు.