EBM News Telugu

ఉధృతంగా ఉక్కు పోరు

0

ప్రొద్దుటూరు టౌన్‌: వైఎస్సార్‌ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ సాధన దిశగా ఉధృత పోరుకు ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమయ్యింది. ఈ మేరకు ఈనెల 29న అఖిలపక్షంతో కలిపి రాష్ట్ర బంద్‌ నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉక్కు పరిశ్రమ సాధనకు కార్యాచరణ సిద్ధం చేసేందుకు ప్రొద్దుటూరులో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి స్వగృ హంలో గురువారం జిల్లా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలతో సజ్జల సమావేశం అయ్యా రు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. 23న కడపలో భారీ ఎత్తున ధర్నా, 24న బద్వేలు, 25న రాజంపేటల్లో ధర్నాలు చేస్తామని తెలిపారు. జమ్మలమడుగులో 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మహాదీక్ష చేపడుతున్నామని చెప్పారు. అఖిలపక్షంతో కలిసి 27న రహదారుల దిగ్బంధం, 29న రాష్ట్ర బంద్‌ చేస్తామన్నారు. ఇక్కడ చేసే ప్రతి ఉద్యమం ఢిల్లీలో వినపడేలా చేస్తామన్నారు.

ఉక్కు ఫ్యాక్టరీని అడ్డుకుంది టీడీపీనే..
‘‘టీడీపీది స్వార్థ రాజకీయం…దుర్మార్గపు ఆలోచన.. ఆ నాడు ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుని, నేడు ఆమరణ దీక్ష చేస్తున్నారు. నాలుగేళ్లుగా అధికారంలో ఉంటూ ఏనాడు ఉక్కు పరిశ్రమ ఊసే ఎత్తని టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉక్కు పరిశ్రమ స్థాపించాలని 48 గంటలు నిరాహార దీక్ష చేసిన వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరవింపజేశారు.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా వైఎస్సార్‌సీపీ మొక్కవోని దీక్షతో అన్ని పార్టీలను కలుపుకొని పోరాటాలు చేస్తోందన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నిరాహార దీక్ష కూడా పోరాటంలో ఒక దశ అన్నారు. పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే బాధ్యత వైఎస్సార్‌సీపీ తీసుకుంటుందన్నారు. ఉక్కు ఫ్యాక్టరీపై పేటెంట్‌ హక్కు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు.

కడపలో ఉక్కుపరిశ్రమ అనే ఆలోచన ఎవ్వరూ చేయని సమయంలోనే దానికి వాస్తవ రూపం ఇచ్చే ప్రయత్నం వైఎస్‌ చేశారని తెలిపారు. ఆ కర్మాగారాన్ని స్వార్థపూరిత రాజకీయాలతో, దుర్మార్గపు ఆలోచనలతో తెలుగుదేశం పార్టీ అడ్డుకుందన్నారు. వైఎస్‌ మరికొద్దికాలం బతికున్నా ఈ సమయానికి ఉక్కు పరిశ్రమ రన్నింగ్‌లో ఉండేదన్నారు. దాదాపు లక్ష మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి దక్కేదని తెలిపారు.

టీడీపీ డ్రామాలను ప్రజలు చూస్తున్నారు..
విభజన చట్టంలో పొందుపర్చిన ఉక్కు పరిశ్రమ నెలకొల్పేందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న టీడీపీ పట్టించుకోలేదని సజ్జల అన్నారు. ఇప్పుడు టీడీపీ తామే చాంపియన్లమని చెప్పుకోవడానికి తాపత్రయ పడటం విడ్డూరమన్నారు. ఈ జిల్లా వాసులకు ఎవరు ఏమి చేశారు, ఎవరి హయాంలో అభివృద్ధి పనులు చేపట్టారన్నది తెలుసునన్నారు.

ఉక్కు ఫ్యాక్టరీకి గండికొట్టి ఇప్పుడు పోరాటం చేస్తామంటే ఎవరు నమ్ముతారని, టీడీపీ డ్రామాలు అందరూ గ్రహిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక కేంద్రం మెడలు వంచి స్టీల్‌ ఫ్యాక్టరీని వైఎస్సార్‌ జిల్లాలో ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఉక్కు పరిశ్రమ పనులు 2019లో మొదలై 2020–21 కల్లా ఫ్యాక్టరీలో ఉత్పత్తి మొదలవుతుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శెట్టిపల్లె రఘురామిరెడ్డి, ఎస్‌బి అంజాద్‌బాషా, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, పార్టీ కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సురేష్‌బాబు, అమరనాథరెడ్డి, కమలాపురం, జమ్మలమడుగు, బద్వేల్‌ సమన్వయకర్తలు, అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, డాక్టర్‌ సుధీర్‌రెడ్డి, డాక్టర్‌ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.

మా ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధం: రాచమల్లు
ఉక్కు పరిశ్రమ సాధన కోసం వైఎస్సార్‌ జిల్లాకు చెందిన తమ ఎమ్మెల్యేలు ఏడుగురు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసేందుకు సిద్ధమేనా? అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సవాల్‌ విసిరారు. గురువారం వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు పుట్టపర్తి సెంటర్‌లో తాను చేపట్టిన 48గంటల దీక్ష విరమణ సందర్భంగా శివప్రసాద్‌రెడ్డి మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే వైఎస్సార్‌సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామా చేశారన్నారు. అందులో జిల్లాకు చెందిన వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి ఉన్నారన్నారు.

జిల్లాలో 9మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు అమ్ముడుబోగా వైఎస్సార్‌సీపీలో ఏడుగురు ఉన్నారని తెలిపారు. టీడీపీ వద్ద ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కలిపి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, దొంగదీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేశ్‌ ఉన్నారన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధించేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్షం ఈ 13 మందితో స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేసేందుకు సిద్ధం చేయాలని డిమాండ్‌ చేశారు. తొలిగా సంతకం చేసేందుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పదవుల ద్వారా వచ్చే విలువ, గౌరవం కంటే జిల్లా బిడ్డల భవిష్యత్తే తమకు ముఖ్యమన్నారు.

రాజీనామాకు ఎంపీ సీఎం రమేశ్‌ సిద్ధమా? అని ప్రశ్నించారు. అఖిలపక్షం తీసుకోబోయే ఏ నిర్ణయానికైనా కట్టుబడి పనిచేస్తామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వెనుకబడింది వైఎస్సార్‌ జిల్లానేనని తెలిపారు. ఇలాంటి జిల్లాపై ప్రధాని మోదీకి ఎందుకు అంత పగ అని ప్రశ్నించారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలని తాను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నానన్నారు. 25 మంది ఎంపీలను తనకు ఇస్తే ఉక్కు పరిశ్రమ, రైల్వే జోన్‌ సాధిస్తామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పుడు ఆయన వద్ద 19మంది ఎంపీలను పెట్టుకుని ఏమీ చేశారని ప్రశ్నించారు. 25మంది ఎంపీలను వైఎస్‌ జగన్‌కు ఇస్తే ఇవన్నీ సాధిస్తారన్నారు. ఇవి రాకపోతే తామంతా రాజకీయాలు వదిలేస్తామన్నారు.

Leave A Reply

Your email address will not be published.