Leading News Portal in Telugu

మళ్లీ గెలిపిస్తే ఆర్నెళ్లలో అద్దం లాంటి రోడ్లు.. జగన్ హామీ జనం నమ్మేస్తారనే? | jagan ignore promises| now| say| will| put| manifesto| netizens| savval


posted on Feb 26, 2024 12:29PM

జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో ఇవ్వడానికి వేరే హామీలేవీ లేవు. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో ఆయన చేసిన వాగ్దానాలలో  పూర్తిగా నెరవేర్చిన హామీ ఒక్కటీ లేకపోవడమే. ఇప్పుడు ఆయన మరో చాన్స్ ఇవ్వండి అంటూ ప్రజల ముందుకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఆయన గత ఐదేళ్లలో హామీల అమలులో విఫలమయ్యాను.. ఈ సారి ఎన్నుకుంటే ఆ హామీలన్నిటినీ ఆరంటే ఆరు నెలల్లో నెరవేర్చి చూపుతాను అంటూ కొత్త పాట మొదలు పెట్టడానికి రెడీ అయిపోయారు. 

సరే గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించడం కంటే ముందు.. ఈ ఐదేళ్లలో ఆయన హయాంలో రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పొరుగు రాష్ట్రాల వారు సైతం సెటైర్లు వేసేంత దుస్థితిలో  ఏపీలో రోడ్ల పరిస్థితి ఉంది. గుంతలలో పడి ఎన్ని ఆర్టీసీ బస్సుల చక్రాలు ఊడి రోడ్ల పక్కకు దౌడు తీశాయో లెక్క లేదు. ఎన్ని చోట్ల ఆర్టీసీ సిబ్బంది బస్సులను నడపలేం అంటూ చేతులెత్తేశారో చెప్పడం కూడా సాధ్యం కాదు. రోడ్ల దుస్థితి కారణంగా జరిగిన ప్రమాదాలలో మరణించిన వారు, క్షతగాత్రులైన వారి సంఖ్య లెక్కపెట్టడమే సాధ్యం కాదు. 

రోడ్లు బ్రహాండంగా ఉన్నాయని ప్రభుత్వం ఎంతగా సొంత బాకా ఊదుకుందామని ప్రయత్నించినా ఫలితం లేని విధంగా సామాజిక మాధ్యమంలో రోడ్ల దుస్థితిపై వీడియోలు ప్రత్యక్ష సాక్షాలుగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ప్రతి ఐదారు నెలలకూ రాష్ట్రంలో రోడ్లపై సమీక్ష చేసే జగన్ ప్రతి సమీక్షలోనూ,  ఆరు నెలల్లో రాష్ట్రం అంతటా గుంతలు లేని రోడ్లే ఉండాలంటూ ఆదేశాలు ఇవ్వడం, అంతే మళ్లీ ఆరు నెలల వరకూ ఆ ఊసే ఎత్తక పోవడం రివాజుగా మారిపోయింది. ఇక ఇప్పుడు రోడ్ల దుస్థితిపై ఎవరినీ మభ్య పెట్టడానికి వీల్లేని పరిస్థితి వచ్చేసింది. వచ్చే ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే సమయం ఆసన్నమైపోయింది. ఆ తరువాత సమీక్షలు చేయడానికి వీలుండదు. ఇప్పటికిప్పుడు సమీక్షలు పెట్టుకుని రోడ్లు బాగు చేసేశామనో, చేసేస్తామనో చెప్పినా జనం నమ్మేందుకు సిద్ధంగా లేరు. దీంతో జగన్ వాస్తవాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ సారి విఫలమయ్యాను, కానీ మరో చాన్స్ ఇచ్చి చూడండి ఆరు నెలల్లో గుంతలు లేని నున్నటి రోడ్లు నిర్మించి చూపిస్తానని జనాన్ని నమ్మించేయడానికి రెడీ అయిపోయారు. అలా చెబితే నమ్ముతారన్న వెర్రినమ్మకం ఆయనలో ఎక్కడ నుంచి వచ్చిందా అని పరిశీలకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ సారి నున్నటి రోడ్లు అంశాన్ని మేనిఫెస్టోలో పెడతానని చెబుతున్నారు. అసలు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలకే ఈ ఐదునెలల్లో దిక్కూ దివాణం లేదనీ, అటువంటిది వచ్చే ఎన్నికలలో రోడ్ల ను అద్దంలా చేస్తాను అంటే మేనిఫెస్టోలో పెట్టినంత మాత్రన జనం ఎలా నమ్ముతారని పరిశీలకులు అంటున్నారు. గత ఐదేళ్లలో రోడ్ల లీటర్ పెట్టోల్, డిజిల్ పై అదనంగా రోడ్ల నిర్వహణ కోసం అని రూపాయి చొప్పున అదనంగా వసూలు చేసి చేసిందేమిటన్న ప్రశ్నకే సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్న జగన్, అలా అదనంగా రోడ్ల కోసం అంటూ వసూలు చేసిన సొమ్ములను కూడా అరకొర పందేరాల పేరిట వాడేశారు. అలాగే నిబంధనలను తుంగలోకి తొక్కి తీసుకువచ్చిన కోట్లకు కోట్ల రుణాలు, చెత్త నుంచి మొదలు పెట్టి అయిన దానికీ కాని దానికీ కూడా వసూలు చేసిన పన్నులు ఇలా అసలు రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న సోమ్ముకూ, తీసుకువచ్చిన అప్పులకూ లెక్కాపత్రం లేకుండా చేసిన జగన్ సర్కార్ ఇప్పుడు వచ్చే ఎన్నికలలో గెలిస్తే రోడ్లను మరమ్మతు చేయిస్తానంటూ చెప్పడంపై నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు. మళ్లీ జనాలను మోసం చేయగలరా అని సవాల్ సైతం చేస్తున్నారు.

రోడ్ల పేరు చెప్పి  బ్యాంకులు.. అంతర్జాతీయ. సంస్థల నుంచి దొరికినంత అప్పు చేసి ఆ సోమ్ములనూ దారి మళ్లించేశారు. దీంతో మరో సారి రోడ్ల పేరు చెబితే పైసా అప్పు కూడా పుట్టే అవకాశం ఇసుమంతైనా లేదు. అయినా ఎన్నికలకు సిద్ధం అన్న నోటితోనే ఆరు నెలల్లో రోడ్లను అద్దంగా మారుస్తామంటూ చెప్పడానికి సిద్ధం అయిపోతున్నారు జగన్.  

అసలు మౌలిక సదుపాయాల గురించి ఐదేళ్లలో ఏ మాత్రం పట్టించుకోని జగన్  సర్కార్ అదేమని అడిగిన వారికి మీకు ఉత్తినే డబ్బులు పంచుతున్నాం కదా అని ఎదురు ప్రశ్నించింది. వైసీపీ నేతలు అయితే జనం రోడ్ల కోసం నిలదీస్తే.. పధకాలు కావాలంటే మీకు సొమ్ములివ్వం జాగ్రత్త అంటూ బెదరించడానికి కూడా వెనుకాడలేదంటే వైసీపీ ఎంతగా బరితెగించేసిందో అర్ధమౌతోంది.  ఈ బరితెగింపును పంటి బిగువున భరించిన ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికలలోగా జగన్ ఆరునెలల్లో రోడ్లు వంటి ఎన్ని హామీలు ఇచ్చినా నమ్మేందుకు సిద్ధంగా లేరు. వైసీపీ బరితెగింపుపై తమ ఆగ్రహాన్ని ఓటు రూపంలో చూపేందుకు రెడీగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సొంత సర్వేలతో సహా అన్ని సర్వేలూ అదే విషయాన్ని చెబుతున్నాయి.