
Russia-Ukraine War: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా విరుచుకుపడుతోంది. కీవ్‌తో పాటు పశ్చిమ భాగాన ఉన్న మరో నగరం ఎల్వీవ్పై ఆదివారం తెల్లవారుజామున రష్యా భారీ వైమానిక దాడికి దిగింది. రష్యా క్షిపణుల్లో ఒకటి తమ గగనతలాన్ని ఉల్లంఘించినట్లు పోలాండ్ ఆరోపించింది. బఖ్ముత్కి సమీపంలో ఉన్న గ్రామాన్ని ఆక్రమించుకున్నామని రష్యా సైన్యం చెప్పిర ఒక రోజు తర్వాత ఆదివారం దాడులని మరింత తీవ్రం చేసింది.
Read Also: RR vs LSG: లక్నో ముందు భారీ స్కోరు.. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సంజూ
శుక్రవారం మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్‌పై ఉగ్రవాదుల దాడి జరిగింది. ఈ దాడిలో 133 మంది మరణించారు. ఈ దాడికి తామే పాల్పడినట్లు ఐఎస్ఎస్-కే బాధ్యత ప్రకటించింది. అయితే, ఇది ఉక్రెయిన్ పనే అని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటన వెనక ఉన్నవారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ ఘటన తర్వాత రష్యా, ఉక్రెయిన్‌పై దాడుల్ని తీవ్రతరం చేసింది. కీవ్‌లో ప్రజలు ఇళ్లు వదిలి వెళ్లొద్దని నగర మేయర్ విటాలి క్లిట్ష్కో ఆదివారం సూచించారు. ఎల్వివ్ ప్రాంత గవర్నర్ మాక్సిమ్ కోజిత్స్కీ మాట్లాడుతూ.. పోలాండ్ సరిహద్దుకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్వీవ్ నగరానికి దక్షిణంగా ఉన్న స్ట్రై జిల్లాపై కూడా దాడి జరిగిందని అన్నారు. రష్యా తమ భూభాగంపై రాత్రికి రాత్రే 29 క్రూయిజ్ క్షిపణులు, 28 డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. అందులో 18 క్షిపణులు, 25 డ్రోన్లను కూల్చివేశామని చెప్పారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై రెండేళ్లు గడుస్తోంది. ఇటీవల మళ్లీ రష్యా అధినేతగా పుతిన్ ఎన్నికయ్యారు. పుతిన్ గెలిచిన కొన్ని రోజులకే మాస్కోపై ఉగ్రదాడి జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో రానున్న రోజుల్లో ఉక్రెయిన్‌పై భారీ దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్రోకస్ సిటీ హాల్ దాడిలో ఉక్రెయిన్ ప్రమేయం ఎలాంటి సంకేతాలు కనిపించలేదని అమెరికా పేర్కొంది.