Leading News Portal in Telugu

Priyanka Gandhi : ప్రజల కోసం పని చేయడమే కాంగ్రెస్ లక్ష్యం..


Priyanka Gandhi : ప్రజల కోసం పని చేయడమే కాంగ్రెస్ లక్ష్యం..

వికారాబాద్‌ జిల్లా తాండూరులో నిర్వహించిన కాంగ్రెస్‌ జనజాతర సభలో ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాండూరుకు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉందని, చిలుకూరు బాలాజీ ఉన్న పవిత్ర ప్రాంతం ఇది.. నాకు ఈ ప్రాంతం అంటే ప్రేమ ఉందని ఆమె అన్నారు. ఇందిరా గాంధీ కి  మీరంతా ప్రేమను పంచారని, నా తల్లి  సోనియా గాంధీని మీరు సోనియమ్మ అంటూ ప్రేమతో పిలిచి తల్లి పాత్ర ఇచ్చారన్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాసేవకు పునరంకితం అయ్యే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ఆమె అన్నారు. ప్రజల కోసం పని చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని ఆమె వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాల్సిన శక్తిని ఇచ్చారని, రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నాలకు తెలంగాణ నుంచే అడ్డుకోవాలన్నారు ప్రియాంక గాంధీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 500 వందలకే ఇస్తోంది…కాని ఉత్తర ప్రదేశ్ లో 1200 రూపాయలకు ఇస్తున్నారని, ధరల నియంత్రణ ను బీజేపీ ప్రభుత్వం చేయడం లేదని ఆమె అన్నారు.  పదేళ్ల పాలనలో బీజేపీ ధనవంతుల కోసమే పనిచేసిందని, మహిళలు, వెనుకబడిన వర్గాలు, కార్మికులు ,పేదల కోసం బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆమె విమర్శించారు.


అంతేకాకుండా..’సామాన్యులపై పన్నులు పెరుగుతున్నాయి.. కాని ధనవంతులపై పన్నులు మాత్రం పెరగవు… ధనికుల 16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారు..కాని రైతులకు ఏ మాత్రం సాయం అందలేదు.. పంట నష్టపోయిన రైతులకు సహాయం అందడం లేదు.. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి.. నోట్ల రద్దుతో  రైతులు, చిన్న వ్యాపారులు, సామాన్యుల నడ్డి విరిగింది.. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా అడిగినా బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదు.. సంక్షేమ పథకాలు, రుణమాఫీ కేంద్రం నుంచి రాలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బీజేపీ హయాంలో ఆగిపోయింది… దేశంలో 70 కోట్ల మంది నిరుద్యోగులున్నారు.. 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.. సామాన్య ఆదాయ పన్ను పెరుగుతోంది… దేశంలో విమానాశ్రయాలు. బొగ్గు గనులు, విద్యుత్, నౌకాశ్రయాలు పెద్ద పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్తున్నాయి.. అదానీ, అంబానీ పన్నులను ప్రజలు చెల్లిస్తున్నారు… దేశం లోని సంపదను ఇద్దరు, ముగ్గురు ధనవంతులకు వెళ్తోంది.. దేశంలోని మీడియా సంస్థలు ఇద్దరి ముగ్గురి చేతుల్లోకి వెళ్లాయి.. వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లడం లేదు… మోదీ, ఆయన మంత్రులు ఓటు అడగడానికి వచ్చినప్పుడు ప్రశ్నించాలి.. ప్రజల జీవన విధానం ఎలా ఉందన్న విషయాన్ని ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదు’ అని ప్రియాంక గాంధీ అన్నారు.