Leading News Portal in Telugu

AP Elections 2024: చివరి రోజు ఏపీకి అగ్రనేతలు.. కడపకు రాహుల్.. తిరుపతికి నడ్డా..


AP Elections 2024: చివరి రోజు ఏపీకి అగ్రనేతలు.. కడపకు రాహుల్.. తిరుపతికి నడ్డా..

AP Elections 2024: ఎన్నికల షెడ్యూల్ వచ్చాక తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించబోతున్నారు రాహుల్‌ గాంధీ. ఇవాళ కడపలో రాహుల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ ఉదయం పదకొండున్నరకు కడప విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్‌… అక్కడి నుంచి హెలికాప్టర్‌లో 11 గంటల 45 నిముషాలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. వైఎస్ఆర్ సమాధి దగ్గర నివాళులర్పిస్తారు. ఆ తరువాత ఒంటి గంట సమయంలో కడపలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు రాహుల్‌.


మరోవైపు.. ఎన్నికల ప్రచారం కోసం నేడు ఏపీకి రానున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. తిరుపతిలో జరిగే రోడ్‌షోలో జేపీ నడ్డా పాల్గొంటారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ఈ ఉదయం 9 గంటలకు తిరపుతిలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం నుండి నాలుగు కాళ్ల మండపం వరకు జేపీ నడ్డా రోడ్‌షో కొనసాగనుంది. జనసేన నేత నాగబాబుతో పాటు టీడీపీ, జనసేన ముఖ్యనేతలు హాజరుకానున్నారు. ఇక, నేడు చిత్తూరులో చంద్రబాబు పర్యటన ఉంది.. ఎన్నికల ముగింపు ప్రచారాన్ని చిత్తూరు సభతో ముగించనున్న చంద్రబాబు… చిత్తూరు సభ అనంతరం నేరుగా తిరుమల వెళ్లనున్నారు.. రాత్రికి స్వామివారిని దర్శించుకోనున్న చంద్రబాబు. మరోవైపు నేడు కాకినాడలో రోడ్ షో, ఎన్నికల ప్రచారంలో పవన్‌ పాల్గొన్నారు..