Leading News Portal in Telugu

Lithium Mining: లిథియం, కోబాల్ట్ వేలం.. 20 బ్లాకులకు రూ. 45,000 కోట్లు..


Lithium Mining: లిథియం, కోబాల్ట్ వేలం.. 20 బ్లాకులకు రూ. 45,000 కోట్లు..

Lithium Mining: ప్రపంచంలోనే అత్యంత విలువైన మూలకాల్లో ఒకటిగా ఉన్న లిథియం, కోబాల్ట్, టైటానియం, కోబాల్ట్ మూలకాల వేలాన్ని బుధవారం కేంద్రం ప్రారంభించింది. తొలి విడతగా 20 బ్లాకులను వేలం వేయనున్నట్లు కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. వీటి విలువ రూ. 45,000 కోట్లు ఉంటుందని చెప్పారు. మొత్తం 100 బ్లాకులను వేలం కోసం గుర్తించామని, వీటిలో తొలి విడతగా 20 బ్లాకుల్ని వేలం వేస్తున్నామని మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఈ 20 బ్లాకులు ఉత్తరప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ మరియు జమ్మూ కాశ్మీర్‌లో ఉన్నాయి.

ఈ 20 బ్లాకుల్లో 16కి కాంపోజిట్ లైసెన్సులు జారీ చేస్తారు, మిగిలిన నాలుగింటికి లైసెన్సులు జారీ చేయబడుతాయి. కాంపోజిట్ లైసెన్సుల కింద నిల్వల అణ్వేషణ అనుమతించబడుతుంది. టెండర్ కోట్ చేసిన వారిలో అత్యధిక రాయల్టీ రేట్ల ఆధారంగా బిడ్డర్లను కేంద్రం ఎంపిక చేయనుంది. టెండర్ డాక్యుమెంట్ల విక్రయం బుధవారం నుంచే ప్రారంభమవుతుంది. గనులు, ఖనిజాల (అభివృద్ధి మరియు నియంత్రణ) చట్టం, ప్రకారం ఆగస్టులో 24 ఖనిజాలను క్రిటికల్, స్ట్రాటజిక్ ఖనిజాలుగా నోటిఫై చేసింది.

ముఖ్యంగా గతేడాది జమ్మూకాశ్మీర్ రియాసి జిల్లాలో భారీ ఎత్తున లిథియం నిల్వలు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. ప్రస్తుత జనరేషన్‌లో మొబైళ్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకు బ్యాటరీల్లో లిథియంని వాడుతున్నారు. సోలార్ ఎనర్జీని స్టోర్ చేయాలంటే బ్యాటరీలు చాలా అవసరం. 2030 నాటికి శిలాజ ఇంధనాల స్థానంలో సోలార్ ఎనర్జీ వంటి శిలాజేతర విద్యుత్ సామర్థ్యాన్ని 50 శాతానికి పెంచాలని భారత్ అనుకుంటోంది. దీనికి లిథియం చాలా కీలకం. కోబాల్ట్ స్టోరేజ్ అప్లికేషన్స్‌లో కీలకమైన మూలకం. టైటానియం రక్షణ పరిశ్రమలో విస్తృతంగా వినియోగిస్తారు. భవిష్యత్ సాంకేతికతలు లిథియం, గ్రాఫైట్, కోబాల్ట్, టైటానియం వంటి రేర్ ఎర్త్ మూలకాలపై ఆధారపడి ఉంది.