Leading News Portal in Telugu

INDIA Bloc: వయనాడ్‌లో అభ్యర్థిని ప్రకటించిన సీపీఐ.. రాహుల్ పరిస్థితి ఏంటి?



Cpi

వయనాడ్ లోక్‌సభ అభ్యర్థిని సీపీఐ ప్రకటించింది (Wayanad Lok Sabha seat). కమ్యూనిస్టులు.. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీపీఐ కీలక ప్రకటన చేసింది. వయనాడ్ సీపీఐ అభ్యర్థిగా అన్నీ రాజాను (Annie Raja) ప్రకటిస్తూ సంచలన ప్రకటన చేసింది.

ప్రస్తుతం వయనాడ్ లోక్‌సభ ఎంపీగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ కొనసాగుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్.. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి.. కేరళ నుంచి వయనాడ్ నుంచి పోటీ చేశారు. కానీ అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయి.. వయనాడ్‌లో మాత్రం గట్టెక్కారు. ఈసారి రాహుల్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఇండియా కూటమిలో భాగస్వామి పార్టీ అయిన సీపీఐ మాత్రం వయనాడ్ అభ్యర్థిగా అన్నీ రాజాను ప్రకటించేసింది.

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. దీంతో రాయ్‌బరేలీ స్థానం ఖాళీ అవ్వడంతో ఆ స్థానం నుంచి రాహుల్ పోటీ చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వయనాడ్ స్థానాన్ని సీపీఐ ప్రకటించిందా? లేదంటే కాంగ్రెస్‌తో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ప్రకటించిందా? అన్నది తెలియాల్సి ఉంది.

ఇక అన్నీ రాజా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో కీలక నాయకురాలు. ఆమె నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (NFIW) ప్రధాన కార్యదర్శి . అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు కూడా. ఆమె ప్రస్తుత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ డి రాజాను వివాహం చేసుకున్నారు.