
సుప్రీంకోర్టులో ఓ యువతిని ప్రధాన న్యాయమూర్తి ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె యొక్క ప్రతిభను న్యాయమూర్తులంతా కొనియాడారు. దీంతో 25 ఏళ్ల ప్రగ్యా ఆనందంతో ఉబ్బితబ్బి అయింది. అసలు ఇంతకీ ఆమె ఎవరు? ఆమెను ఎందుకు సన్మానించారో తెలియాలంటే ఈ వార్త చదవండి.
సుప్రీంకోర్టులో వంట మనిషిగా పని చేస్తున్న అజయ్ కుమార్ సమాల్ కుమార్తె ప్రగ్యాపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రశంసలు కురిపించారు. అగ్ర రాజ్యంలో రెండు యూనివర్సిటీల్లో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ విద్యను అభ్యసించడానికి స్కాలర్‌షిప్‌లను గెలుచుకుంది. దీంతో ఆమెను న్యాయవాదులంతా ఘనంగా సత్కరించారు.
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం మరియు మిచిగాన్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ను అభ్యసించడానికి 25 ఏళ్ల ప్రగ్యా స్కాలర్‌షిప్‌లను గెలుచుకుంది.
రోజువారీ న్యాయ విధులను ప్రారంభించే ముందు బుధవారం న్యాయమూర్తుల లాంజ్‌లో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ప్రగ్యాను అభినందించారు.
ప్రగ్యా తనంతట తానుగా ఏదైనా సాధించగలదని తమకు తెలుసు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ప్రశంసించారు. ఆమెకు అవసరమైన వాటిని పొందేలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రగ్యా దేశానికి సేవ చేయడానికి తిరిగి రావాలని తామంతా ఆశిస్తున్నామని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి.. ప్రజ్ఞకు రాజ్యాంగానికి సంబంధించిన మూడు పుస్తకాలను బహూకరించారు. ఉన్నత న్యాయస్థానంలోని విశిష్ట సభ్యులంతా సంతకం చేసి ఇచ్చారు.
తన తండ్రి ఇష్టం మేరకే న్యాయవృత్తిని ఎంచుకున్నట్లు ప్రగ్యా తెలిపింది. న్యాయవాదులు తనను అభినందించడం చాలా సంతోషంగా ఉందని ఆమె మురిసిపోయింది.