posted on Dec 6, 2023 1:28PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు తొమ్మిదేళ్ల అహంకారపూరిత పాలనకు ముగింపు పలికారు. పాలకుల అహంకారాన్ని ఎదిరిస్తూ ఆందోళనలు చేయలేదు. రోడ్లెక్కలేదు. మౌనంగా ఎన్నికలు వచ్చే వరకూ ఎదురు చూశారు. ఓటు పవర్ ఏమిటో చూపించారు. అంతే తొమ్మిదేళ్లుగా తిరుగులేని అధికారాన్ని చెలాయించిన బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దెదిగిపోయింది. ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాల్సి ఉంది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టిన బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయంలో అస్సలేమీ చేయలేదని అనడానికి వీల్లేదు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలోనూ, సంక్షేమ పథకాలను కొనసాగించడంలోనూ బీఆర్ఎస్ సర్కార్ ఎక్కడా వెనుకబడలేదు. అయితే జనం అభివృద్ధి, సంక్షేమాలతో పాటు గౌరవం కూడా కావాలనుకున్నారు. తమ మాట వినని, తమ ముఖం చూడని ముఖ్యమంత్రి అవసరం లేదని భావించారు. దొరల కోటల్లాంటి నివాసంలో ఉంటూ తనకు అవసరమైనప్పుడు మాత్రమే ప్రజలకు ముఖం చూపించి, ఆ తరువాత నిర్లక్ష్యం చేసే సీఎం వద్దని తిరస్కరించారు. స్థూలంగా, సూక్షంగా చెప్పాలంటే కేసీఆర్ కుటుంబ పాలన, అహంకార పూరిత ధోరణి బీఆర్ఎస్ ఓటమికి కారణం. మరి ఎంతో కొంత రాష్ట్రాభివృద్ధికి పాటుపడి, ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగించిన కేసీఆర్ నే జనం తిరస్కరించారంటే.. అసలు అభవృద్ధి ఆనవాలే లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దివాళా స్థితికి చేర్చిన జగన్ కు ఏపీ జనం ఎలాంటి ఓటమిని అందిస్తారన్న చర్చ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సాగుతోంది. అసలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం లేకుండానే చాలా చాలా కాలంగా ఏపీ ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. నోరెత్తితే కేసు,అడుగు బయటపెడితే జైలు అన్నట్లు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నీ జగన్ రెడ్డి సర్కార్ ఒక జైలుగా మార్చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా, స్వయంగా ముఖ్యమంత్రి సభలకే జనం మొహం చాటేస్తున్నా, పార్టీ కార్యక్రమాలకు కార్యకర్తలే దూరంగా ఉంటున్నా జగన్ తన తీరు, వైఖరీ మార్చుకోవడం లేదు.
నిండా మునిగిన వాడికి చలేమిటన్న చందంగా జగన్ వ్యవహారం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిజానికి ప్రజలు, మధ్య తరగతి మేధావులే కాదు, గత ఎన్నికల్లో ఏదో ఆశించి, వైసేపీకి ఓటేసి, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన వైసీపీ ఓటర్లు కూడా ఇప్పుడు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా, ఎన్నికలు సమయంలో చంద్రబాబు అంతటి సీనియర్ నాయకుని, అక్రమంగా, అరెస్ట్ చేసి, జైలుకు పంపి వేధింపులకు గురిచేయడాన్ని, ఆయనతో పాటుగా,ఆయన్ని అయన కుటుంబ సభ్యులనూ వేధింపులకు గురి చేస్తున్న తీరును పార్టీలకు అతీతంగా సామాన్య ఓటర్లు చాలాచాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
చట్టాని చుట్టేసి, రాజ్యంగ విరుద్ధ పరిపాలనను ఇష్టారాజ్యంగా సాగిస్తున్న జగన్ రెడ్డి పాలనపై విసుగెత్తిన ప్రజలు ఇప్పుడు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, వైసీపీ మంత్రులు, నాయకులు చేసిన ప్రకటనలు జనంలో జగన్ సర్కార్ పట్ల పూర్తి స్థాయి వ్యతిరేకతకు కారణమయ్యాయి. శిశుపాలుడి నూటొక్కో తప్పులా జగన్ చంద్రబాబును అరెస్టు చేసి తన చివరి తప్పు చేసేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఇప్పుడు జగన్ తల్లకిందులుగా తపస్సు చేసినా ప్రజాభిమానాన్ని తిరిగి పొందగలిగే పరిస్థితి లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే వెలువడిన పలు సర్వేలు, స్వయంగా జగన్ కు ఇంటెలిజెన్స వర్గాలు అందించిన నివేదికలు, చివరాఖరికి జగన్ తన పార్టీ నేతలు, కార్యకర్తల కంటే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్న ఐ ప్యాక్ కూడా ఇక సర్దేసుకోవడం మేలు, మరో చాన్స్ లేదనే చెప్పాయని పార్టీ వర్గాలలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాలను జోడు గుర్రాల్లా పరుగులెత్తించినా, పాలకుడిలో అహంకారాన్ని సహించని జనం ఆయనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అలాంటిది అభివృద్ధీ, సంక్షేమాలను పట్టించుకోకుండా, కేవలం అహంకారంతో, అహంభావంతో పాలన సాగిస్తున్న జగన్ సర్కార్ ను ఏ స్థాయిలో ఓడిస్తారోనన్న చర్చ ఏపీలో యమా జోరుగా సాగుతోంది.