Leading News Portal in Telugu

రోజాకు నో టికెట్? నగరిలో వ్యతిరేక నెపమా.. నిజమా? | ycp denies ticket to roja| nagari| opposition| peddireddy


posted on Dec 14, 2023 1:24PM

ఏపీలో అధికార పార్టీ వైసీపీలో ఇప్పుడు ముసలం మొదలైంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓటమి భయంతో ఈసారి ఎన్నికలలో భారీగా సిట్టింగులను మార్చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో జగన్ సర్కార్ ప్రజలలో భారీ అసంతృప్తిని మూటగట్టుకోగా.. ఇప్పుడు సిట్టింగుల మార్పుతో ఎమ్మెల్యేలు కూడా అధిష్టానానంపై రివర్స్ అవుతున్నారు. కానీ, ఇవేమీ లెక్కచేయకుండా జగన్ మాత్రం నియోజకవర్గాల ఇంచార్జిలను మార్చేస్తున్నారు. ఇప్పటికే 11 మంది నియోజవర్గాల ఇన్ చార్జిలను మార్చేయగా.. ఈ  మార్పు పరంపర ఇక్కడితో ఆగదనీ కొనసాగుతుందనీ  వైసీపీ వర్గాలే బహిరంగంగా చెప్తున్నాయి. ఇంకా చాల మంది ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలను మార్చే ఉద్దేశంలో జగన్ ఉన్నట్లు తెలుస్తుండగా.. ఈ సంఖ్య 90 వరకూ వెళ్తుందని కూడా  అంటున్నారు. దీనికి తోడు కొందరికి అసలు సీట్లు కేటాయించే పరిస్థితి కూడా లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ టికెట్లు దక్కని జాబితాలో సీనియర్ నేతలు, మంత్రులు కూడా ఉన్నారని  అంటున్నారు.

ఇప్పటికే వైసీపీకి వ్యూహాలను అందించే ఐ ప్యాక్ సంస్థతో పాటు వైసీపీ సొంత సర్వేల ఫలితాల ఆధారంగా.. పనితీరు సరిగాలేని వారిని జగన్ పక్కన పెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్న ప్రాంతాలలో క్యాండిడేట్లను మార్చేస్తుండగా.. అసలు క్యాండిడేట్లపైనే అసంతృప్తి ఉంటే వాళ్ళని నిర్ధాక్షణ్యంగా పక్కన పెట్టేయాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే కొందరు మంత్రులకు, మాజీ మంత్రులకు ఈసారి టికెట్ లేనట్లే అనే ప్రచారం సాగుతున్నది. ఇందులో  ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే, మంత్రి రోజా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రోజాపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసంతృప్తికి స్థానిక రాజకీయ పరిస్థితులు, సొంత పార్టీలో కుమ్ములాటలు తోడై  ఈసారి టికెట్ దక్కే అవకాశాలు లేనట్లేనని వైసీపీ నేతలే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. మంగళగిరి ఆర్కే లాంటి ఇష్టుడైన నేతను కూడా వదులుకున్న జగన్.. రోజాను పక్కన పెట్టేయడం పెద్ద వింతేమీ కాదని.. దీనికి తోడు వైసీపీలో రెండో స్థానంలో కొనసాగుతున్న పెద్దిరెడ్డితో వైరం కూడా రోజాకు టికెట్ లేకుండా చేసిందని పేర్కొంటున్నారు.

నిజానికి ఏపీ రాజకీయాలలో రాష్ట్రం మొత్తం ఒక లెక్క.. ఉమ్మడి చిత్తూరు జిల్లాది మరో లెక్కగా చెప్తుంటారు రాజకీయ విశ్లేషకులు. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాతో పాటు వైసీపీలో పెద్దిరెడ్డి లాంటి నేతది అదే జిల్లా కావడంతో ఇక్కడ రాజకీయాలెప్పుడూ  హాట్ హాట్ గా  హీటెక్కి ఉంటాయి. అందునా  వైసీపీలో పెద్దిరెడ్డికి తెలియకుండా ఈ జిల్లాలో ఏదీ జరగదు. అందుకే పెద్దిరెడ్డి ఆశీస్సులు లేకపోతే ఇక్కడ ఎవరికైనా సీట్ లేనట్లే.  అలాంటిది రోజాకు పెద్దిరెడ్డికి మధ్య మనస్పర్థలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మనస్పర్థల కారణంగానే రోజా సొంత నియోజకవర్గం నగరిలో కూడా చాలా కాలంగా రాజకీయంగా ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా చెప్పాలంటే నగరి వైసీపీలో ఇప్పుడు రోజాకు వ్యతిరేకంగా మరో వర్గం కూడా తయారైంది. స్వపక్షంలోనే ప్రత్యర్థులు రోజాపై కత్తులు నూరుతున్నారు. ముఖ్యంగా రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, కేజే శాంతి, కేజే కుమార్లు నిత్యం రోజాపై విమర్శల దండయాత్ర చేస్తున్నారు. దీంతో రానున్న ఎన్నికలలో రోజా నగరి నుండి పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయం అన్న అభిప్రాయం పార్టీ అధినేతలో కలిగింది.  

అందుకే ఇప్పుడు రోజాను నగరి నుండి బయటకి పంపేయాలని  ఆయనో  నిర్ణయానికి వచ్చేశారని చెబుతున్నారు. పోనీ జిల్లాలో మిగతా స్థానాల్లో అవకాశం ఉంటుందా అంటే జిల్లా వ్యాప్తంగా రోజాపై వ్యతిరేకతే కాకుండా.. మంత్రి పెద్దిరెడ్డి కూడా వ్యతిరేకించడంతో ఆ చాన్స్ కూడా లేకుండా పోయిందంటున్నారు.  రోజాను పూర్తిగా ఉమ్మడి చిత్తూరు జిల్లాను వీడి నెల్లూరు పంపాలని అధిష్టానం పరిశీలిస్తున్నట్లు వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.  ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి వైసీపీలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి వంటి వారు తెలుగేదేశంలో చేరిపోవడంతో.. ఇప్పుడు నెల్లూరు వైసీపీలో  నాయకత్వ సూన్యత కనిపిస్తున్నది.

ఈ క్రమంలోనే రోజాను నెల్లూరు పంపించాలని జగన్ మోహన్ రెడ్డి అండ్ కో భావిస్తున్నట్లు ప్రచారం ఉంది. అయితే  నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ప్రతాప్ కుమార్ రెడ్డి లాంటి వారు రోజా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజా వ్యతిరేకతకు తోడు రోజాపై వ్యతిరేకత కూడా కలిసి తమ విజయావకాశాలపై ప్రభావం పడుతుందని నెల్లూరు జిల్లా నేతలు భయపడుతున్నారని అంటున్నారు.  దీంతో రోజాను నెల్లూరుకు బదలాయించవద్దని జగన్ కు మొరపెట్టుకున్నారని కూడా చెబుతున్నారు.  దీంతో   రోజాకు ఈసారి ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కడం కష్టమేనని, ఈ విషయాన్ని ఆమెకు పార్టీ హైమాండ్ తెలియజేసి , పార్టీలో  గౌరవప్రదమైన పదవి ఇస్తామనీ ప్రతిపాదించినట్లు కూడా చెబుతున్నారు.