Leading News Portal in Telugu

జగన్ పై గళమెత్తిన వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి 


posted on Feb 12, 2024 3:32PM

ఎన్నికలు సమీపిస్తుండడంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో నేతల మధ్య ఉన్న విభేదాలు బయటపడుతున్నాయి. పార్టీ అధికారంలో ఉండడం, వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తామనే భావనతో నేతలు ఇన్నాళ్లూ తమ అసంతృప్తిని బయటపడనివ్వకుండా జాగ్రత్తపడుతూ వచ్చారు. 

 అధికార పక్షం వైసీపీలో అసంతృప్తుల సంఖ్య అంతకంతకు అధికమవుతోంది. తాజాగా, వైసీపీ ఎమ్మెల్సీ, పార్టీ బీసీ సెల్ ప్రెసిడెంట్ జంగా కృష్ణమూర్తి వ్యతిరేక గళం వినిపించారు. 

బీసీలకు పదవులు ఇచ్చారు కానీ, అధికారాలు ఏవి? అని ప్రశ్నించారు. కీలక పదవులన్నీ ఒక సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయని… బీసీలకు నామమాత్రం కూడా అధికారాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. నేతిబీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో, వైసీపీలో సామాజిక న్యాయం కూడా అంతేనని జంగా కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. 

బీసీ నేతలకు ఎక్కడా న్యాయం జరగడంలేదని, గౌరవం ఇవ్వడంలేదని, ప్రోటోకాల్ పాటించడంలేదని ఆరోపించారు. బీసీలు ఇవాళ సంక్షేమం కోసం కాకుండా ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. బీసీలు ఇవాళ పార్టీకి దూరమవుతున్నారని, దీనిపై వైసీపీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు.