Leading News Portal in Telugu

కాంగ్రెస్ పార్టీలో చేరిన తీగల కృష్ణారెడ్డి 


posted on Feb 26, 2024 3:05PM

గత అసెంబ్లీ ఎన్నికల్లో  తెలంగాణలో బిఆర్ఎస్ పరాజయం కాంగ్రెస్ పార్టీకి జీవం నింపుతోంది.  బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. టిడిపి ప్రభుత్వ హాయంలో హైదరాబాద్ మేయర్ గా పనిచేసిన తీగలకృష్ణారెడ్డి ఇటీవలె బిఆర్ఎస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే . సోమవారం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు కోడలు, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ అనితా రెడ్డి కూడా కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. దీపాదాస్ మున్షీ వారికి కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు.

తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు అనితారెడ్డి నిన్న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వారు రాజీనామా లేఖలను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం వల్లే వారు బీఆర్ఎస్‌ను వీడినట్లుగా చెబుతున్నారు. తీగల కృష్ణారెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు జీహెచ్ఎంసీ మేయర్‌గా పని చేశారు. 2014లో మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు.