posted on Feb 7, 2025 9:53AM
అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలలో క్యారెక్టర్ అంటూ ఇటీవలే పార్టీకీ, పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు విజయసాయి నుంచీ ఘటు స్పందన వచ్చింది. రాజకీయాలలో ఎవరికైనా క్యారక్టర్ అనేది చాలా అవసరమని విజయసాయి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దీంతో తన క్యారెక్టర్ పై మాట్టాడిన జగన్ కు క్యారెక్టర్ లేదని చెప్పకనే చెప్పేశారు. వీరిద్దరి మధ్యా సంవాదంపై నెటిజన్లు ఓ రేంజ్ లో స్పందిస్తున్నారు. ఇంతకీ ఇద్దరిలో క్యారెక్టర్ లేనిది ఎవరికి? విజయసాయికా? జగన్ కా లేక ఇద్దరికీనా? అంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు.
విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే పార్టీకి రాజీనామా చేయలేదు. తాను రాజకీయాలకు దూరం అవుతున్నానని మాత్రపే పేర్కొన్నారు. ఆ తరువాత జగన్ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆయనను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడంతోనే పార్టీకీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి రాజీనామా లేఖను జగన్ కు పంపారు. అప్పుడే విజయసాయి, జగన్ ల మధ్య అగాధం ఏర్పడిందన్న వార్తలు గట్టిగా వినిపించాయి. అదీ కాక చాలా కాలంలో వైసీపీలో విజయసాయి ప్రాధాన్యత తగ్గుతూ వస్తుండటం కూడా విజయసాయి రాజీనామా నిర్ణయానికి కారణమై ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషించారు.
వైసీపీ ఆవిర్భావం నుంచీ జగన్ తో కలిసి నడిచిన విజయసాయి జగన్ కు, ఆయన పార్టీకీ దూరం కావడంపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అదీ కాక జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ ఏ1 అయితే విజయసాయి ఏ2. దీంతో ఇప్పుడు విజయసాయి జగన్ కు దూరం అవ్వడమే కాకుండా ఆయన క్యారెక్టర్ పై కూడా వ్యాఖ్యలు చేయడం పెను సంచలనంగా మారింది. తన రాజీనామా సమయంలో కూడా జగన్ పట్ల చాలా సానుకూలంగా విజయసాయి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆయన మళ్లీ అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కూడా విజయసాయి చెప్పారు. తానిక రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతున్నాననీ, వ్యవసాయమే ఇక తన వ్యాపకమనీ ప్రకటించినా.. విజయసాయి మాటల్లో, చేతల్లో రాజకీయాలు కనిపిస్తూనే ఉన్నాయి. వైసీపీకి రాజీనామా చేసిన తరువాత హైదరాబద్ లోడస్ పాండ్ లోని షర్మిల నివాసంలో ఆమెతో విజయసాయి భేటీ కావడం రాజకీయంగా కలకలం సృష్టించింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి, జగన్ రెడ్డిల మధ్య మాటలయుద్ధం అన్న స్థాయిలో జరుగుతున్న పరిణామాలు అంతకు మించి సంచలనం సృష్టిస్తున్నాయి.
విజయసాయి రాజీనామా చేసినా వైసీపీ నుంచి జగన్ సహా ఎవరూ కూడా పెద్దగా స్పందించలేదు. అదోక విషయం కాదన్నట్లుగానే వ్యవహరించారు. స్పందించక పోవడం ద్వారా విజయసాయిరెడ్డి తమకు పెద్ద ఇంపార్టెంట్ కాదన్న సంకేతం ఇచ్చారు. అయితే గురువారం (ఫిబ్రవరి 6) మీడియాతో మాట్లాడుతూ జగన్ విజయసాయి రాజీనామాపై స్పందించారు. రాజకీయాలలో క్యారెక్టర్ ముఖ్యం అంటూ వ్యాఖ్యానించి అలా క్యారెక్టర్ లేకుండా పార్టీని వదిలేసిన విజయసాయిరెడ్డి అయినా మరొకరైనా ఒకటే నంటూ వ్యాఖ్యనించారు. దీనిపై విజయసాయి వెంటనే రియాక్ట్ అయ్యారు. నిజమే రాజకీయాలలో క్యారెక్టర్ అనేది ఎవరికైనా ముఖ్యమేనని ట్వీట్ చేశారు. తాను రాజకీయాలలోనే కాదు వ్యక్తిగతంగా కూడా క్యారెక్టర్ ఉన్నవాడినేనని చెప్పుకున్నారు. అందుకే పార్టీకే కాదు, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశానని పేర్కొన్నారు.
రెండు వారాల కిందల వైసీపీకి, రాజ్యసభ్యత్వానికీ రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సమయంలో జగన్ పై తన పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జగన్ ఫ్యామిలీతో తనకున్న అనుభందాన్ని చెప్పుకొచ్చారు. తాను తన రాజీనామా విషయం విదేశీ పర్యటనలో ఉన్న జగన్ కు చెప్పాననీ, ఆయన అనుమతితోనే వైదొలగుతున్నాననీ కూడా ఆ మీడియా సమావేశంలో చెప్పారు. అంతే ఆ తరువాత ఆయన ఇక రాజకీయాల గురించి బాహాటంగా మాట్లాడింది లేదు. అయితే జగన్ విదేశీ పర్యటన నుంచి వచ్చిన కొన్ని రోజుల తరువాత విజయసాయి క్యారెక్టర్ పై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఆ స్పందన జగన్ తో ఢీ అంటే ఢీ అనడానికి విజయసాయిరెడ్డి రెడీ అయిపోయారా అన్న అనుమానాలకు తావిస్తోంది.
వ్యక్తిగత జీవితంలో విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడ్ని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు, భయం అనేది నాలో అసలులేదు కాబట్టే రాజ్యసభ పదవి, పార్టీ పదవులతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాను అంటూ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయవర్గాలలో పెను సంచలనంగా మారింది. దీనికి జగన్ ఎలా స్పందిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఇరువురి మధ్యా ఈ పరిణామం మాటలయుద్ధానికి దారి తీసే పరిస్థితులున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రభావం వైసీపీ మీదే కాదు, జగన్ ఆస్తుల కేసులపైనా పడుతుందంటున్నారు.