జగన్ నీకు క్యారెక్టర్ ఉందా?.. సూటిగా నిలదీసిన షర్మిల! | sharmila question did jagan has character|fires| ycp| supremo| misdeeds| towards| her| deny| share
posted on Feb 8, 2025 8:53AM
ఏపీసీసీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయానా సోదరి అయిన షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న జగన్ మోహన్ రెడ్డికి ఇతరుల క్యారెక్టర్ గురించి మాట్లాడే కనీస అర్హత లేదని కుండబద్దలు కొట్టారు.
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో ఓటమి తరువాత నుంచీ వైసీపీకి గడ్డు కాలం దాపురించినట్లే కనిపిస్తోంది. ఆ పార్టీ నుంచి ఒకరి తరువాత ఒకరు అన్నట్లుగా నాయకులు బయటకు వెళ్లిపోతున్నారు. అలా వెళ్లి పోతున్నవారిలో జగన్ కు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన వారూ ఉంటున్నారు. కొద్ది రోజుల కిందటే వైసీపీలో కీలక నేత, జగన్ కుటుంబానికి సన్నిహితుడు, జగన్ అక్రమ కేసులలో సహ నిందితుడు అయిన విజయసాయిరెడ్డి పార్టీకి దూరమయ్యారు. పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.. ఇక నుంచీ తాను రాజకీయాల జోలికి పోనని ప్రకటించారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ పట్ల తన స్వామి భక్తిని ప్రదర్శించారు. తనకు అవకాశాలిచ్చినందుకు ఆయనకు కృతజ్ణతలు తెలిపారు. ఇక నుంచి వ్యవసాయమే తన వ్యాపకం అని చెప్పిన విజయసాయిరెడ్డి అన్నట్లుగానే తాను సాగు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపే ఫొటోలను సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. అక్కడితో రాజకీయాలలో, వైసీపీలో విజయసాయి రెడ్డి పాత్రకు ఎండ్ కార్డ్ పడిపోయిందనే అంతా భావించారు.
అయితే జగన్ విదేశీ పర్యటన ముగించుకు వచ్చిన కొన్ని రోజుల తరువాత తాడేపల్లి ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ రెడ్డి రాజీనామాపై స్పందించారు. అన్ని అవకాశాలూ ఇచ్చిన పార్టీని కాదని బయటకు వెళ్లపోవడం సరికాదన్నట్లుగా మాట్లాడారు. రాజకీయాలలో ఎవరికైనా సరే క్యారెక్టర్ ముఖ్యమని అనడం ద్వారా విజయసాయిరెడ్డికి క్యారెక్టర్ లేదని చెప్పకనే చెప్పారు.
దీనిపై విజయసాయి కూడా ఘాటుగా స్పందించారు. తనకు క్యారెక్టర్ లేదని జగన్ అనడాన్ని తప్పుపట్టారు. క్యారెక్టర్ ఉంది కనుకనే పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులు కున్నానని చెప్పుకొచ్చారు. తన క్యారెక్టర్ గురించి జగన్ మాటలు పూర్తి అవాస్తవాలు అన్నదే విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా చేసిన పోస్టు సారాంశం. విజయ సాయి రెడ్డి తరువాత జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన మోపిదేవి వెంకటరమణ కూడా జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ కు క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు విమర్శలు ఉన్నాయి. జగన్ అక్రమ ఆస్తుల కేసులో తాను జైలుకు వెళ్లిన సంగతిని గుర్తు చేస్తూ నిజంగా తనకు క్యారెక్టర్ లేకపోతే జగన్ అక్రమాస్తుల కేసులో ఇరుక్కుని ఉండేవాడినే కాదని చెప్పుకొచ్చారు.
వీరిద్దరి కౌంటర్ ను తలదన్నేలా ఇప్పడు షర్మిల మీడియా ముందుకు వచ్చి జగన్ క్యారెక్టర్ పై సంచలన విషయాలను వెల్లడించారు. జగన్ వ్యక్తిత్వం, విశ్వసనీయత గురించి మాట్లాడటం అతి పెద్ద జోక్ గా షర్మిల అభివర్ణించారు. తోబుట్టువునైన తనపైనా, తన వ్యక్తిత్వంపైనా జగన్ నీచాతినీచంగా బురద జల్లారని షర్మిల ఆరోపించారు. విజయసాయి వైసీపీకి రాజీనామా చేసిన తరువాత తనతో భేటీ అయ్యారని చెప్పిన షర్మిల ఆ సందర్భంగా ఆయన చాలా చాలా విషయాలు చెప్పారని పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా విజయసాయి గతంలో మీడియా సమావేశంలో మాట్లాడడానికి కారణం జగన్ ఒత్తిడేనని విజయసాయి తనతో చెప్పారనీ, షేర్ల విషయంలో జగన్ చెబుతున్నదంతా అవాస్తవమని తన తల్లి విజయమ్మ లేఖ రాయడంతో మరో సారి మీడియా సమావేశం పెట్టి విజయమ్మలేఖను ఖండించాల్సిందిగా జగన్ విజయసాయిపై ఒత్తిడి తెచ్చారనీ, ఆయన వినకపోవడంతో సుబ్బారెడ్డితో మీడియా సమావేశంలో మాట్లాడించారనీ షర్మిల తెలిపారు. ఈ విషయాలన్నీ విజయసాయి స్వయంగా తనతో చెప్పారని షర్మిల వెల్లడించారు. ఇంత నీచానికి ఒడిగట్టిన జగన్ క్యారెక్టర్ గురించి మాట్లాడటమేంటని ఆమె ఎద్దేవా చేశారు. జగన్ కు క్యారెక్టర్ అంటే అర్ధం తెలియదని దుయ్యబట్టారు.
మేనకోడలు, మేనల్లుడి ఆస్తులు కాజేయాలని కుట్రలు చేసిన వ్యక్తి జగన్ అని షర్మిల విమర్శలు గుప్పించారు. జగన్, ఆయన భార్య భారతి బైబిల్ ముందు పెట్టుకుని వారి క్యారెక్టర్ ఏంటో, ఎంత దిగజారిపోయారో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.