Leading News Portal in Telugu

ఆర్జీవీకి వరుస షాకులు..విచారణకు హాజరు కావాలంటూ గుంటూరు పోలీసుల నోటీసు | guntur police notice to gjv| attend| inquiry| febraury| 10th| ongole| police| question


posted on Feb 8, 2025 9:23AM

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు గుంటూరు పోలీసులు షాక్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోల మార్ఫింగ్ కేసులో ఒంగోలు పోలీసులు రామ్ గోపాల్ వర్మను శుక్రవారం (ఫిబ్రవరి 7) సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. దాదాపు 9 గంటల పాటు పోలీసుల విచారణను ఎదుర్కొని బయటకు వచ్చిన వెంటనే రామ్ గోపాల్ వర్మకు గుంటూరు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు.

గతంలో రామ్ గోపాల్ వర్మ తీసిన అమ్మరాజ్యంలో కడప రెడ్డి సినిమాకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. పెద్దగా సమయం ఇవ్వకుండానే ఈ నెల 10న అంటే సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. గతంలోలా నోటీసులను బేఖాతరు చేసి విచారణకు డుమ్మా కొట్టే అవకాశం రామ్ గోపాల్ వర్మకు ఇప్పుడు లేదు. నోటీసుల ప్రకారం ఆయన విచారణకు హాజరు కాకపోతే బెయిలు రద్దౌతుంది. దీంతో అనివార్యంగా రామ్ గోపాల్ వర్మ గుంటూరు పోలీసుల ఎదుట సోమవారం (ఫిబ్రవరి 10) విచారణకు హాజరు కాకతప్పదు. 

ఇక పోతే రామ్ గోపాల్ వర్మను ఒంగోలు పోలీసులు సుదీర్ఘంగా దాదాపు 9 గంటల పాటు విచారించారు. విచారణలో భాగంగా ఆయనకు దాదాపు 50 ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. వీటిలో కొన్ని ప్రశ్నలకు రామ్ గోపాల్ వర్మ సమాధానాలు ఇచ్చారు, మిగిలిన వాటికి డొంకతిరుగుడుగా మాట్లాడారని సమాచారం. కాగా విచారణ అనంతరం అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని సూచించారు. 9 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం రాత్రి పది గంటల ప్రాంతంలో ఆయన పోలీసు స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. ఆయన ఇలా బయటకు వచ్చారో లేదో అలా గుంటూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు.