Leading News Portal in Telugu

AUS vs WI: అంతర్జాతీయ క్రికెట్‌లో విచిత్రకర సంఘటన.. అప్పీల్‌ చేయలేదని..! వీడియో వైరల్


AUS vs WI: అంతర్జాతీయ క్రికెట్‌లో విచిత్రకర సంఘటన.. అప్పీల్‌ చేయలేదని..! వీడియో వైరల్

Alzarri Joseph Survives Despite Being Run-out: అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. గల్లీ క్రికెట్‌లో మాదిరి.. ఆటగాళ్లు అప్పీల్ చేయలేదని ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. అంపైర్ చర్యతో అప్పటికే సెలబ్రేషన్స్‌లో మునిగితేలిపోయిన ప్లేయర్స్.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన ఆదివారం అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో చోటుచేసుకుంది. ఇందుకుసంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు ఏం జరిగిందంటే…


రెండో టీ20లో ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేయగా.. లక్ష్య చేధనకు వెస్టిండీస్‌ దిగింది. ఆసీస్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19 ఓవర్‌ మూడో బంతిని విండీస్ బ్యాటర్ అల్జారీ జోసెఫ్ కవర్స్ వైపు ఆడాడు. జోసెఫ్ సింగిల్ కోసం పరుగెత్తగా.. కవర్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న టిమ్‌ డెవిడ్‌ బంతిని బౌలర్ జాన్సన్‌కు విసిరాడు. బంతిని అందుకున్న జాన్సన్‌.. రెప్పపాటులో బెయిల్స్‌ను పడగొట్టాడు. జోసెఫ్ ఔట్‌ అనుకుని జాన్సన్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకోవడం మొదలు పెట్టాడు. మరోవైపు ఆసీస్‌ కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌తో పాటు ప్లేయర్స్ అందరూ సెలబ్రేషన్స్‌లో మునిగితేలిపోయారు.

రిప్లేలో కూడా బెయిల్స్‌ కిందపడేటప్పటికి అల్జారీ జోషఫ్‌ క్రీజులో బ్యాట్ పెట్టలేదు. అయితే ఇక్కడే ఫీల్డ్‌ అంపైర్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు. జోషఫ్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఒక్కసారిగా షాకయ్యారు. కారణం ఏంటని అంపైర్‌ను ఆసీస్‌ కెప్టెన్ మిచెల్‌ మార్ష్‌ ప్రశ్నించగా.. రనౌట్‌కు ఎవరూ అప్పీల్‌ చేయలేదని, అందుకే నాటౌట్‌గా ప్రకటించానని బదులిచ్చాడు. తాను అప్పీల్‌ చేశానని అంపైర్‌తో టిమ్‌ డేవిడ్‌ వాగ్వాదానికి దిగాడు. మార్ష్‌ కూడా ఆసంతృప్తి వ్యక్తం చేస్తూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు. ఏంసీసీ రూల్స్‌లోని సెక్షన్ 31.1 ప్రకారం.. ప్లేయర్ అప్పీల్ చేయకుంటే అంపైర్లు అవుట్‌గా ప్రకటించకూడదు.