Leading News Portal in Telugu

CM YS Jagan: హిందూపురంలో విరుచుకుపడ్డ జగన్‌.. అసలు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అంటే ఏంటో తెలుసా?



Jagan

CM YS Jagan: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈ రోజు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తోన్న హిందూపురంలో సభ నిర్వహించారు.. ఈ సందర్భంగా విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టిన ఆయన.. జగన్‌ భూములు ఇచ్చేవాడే కానీ.. లాక్కునేవాడు కాదు అని స్పష్టం చేశారు.. అసలు, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అంటే ఏంటో చంద్రబాబుకు తెలుసా? అని నిలదీశారు. భూమిపై సంపూర్ణ హక్కులు ఇవ్వడమే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్ అని స్పష్టం చేశారు.. ఏ భూమి ఎక్కడ కొనాలన్నా వివాదాలు ఉన్నాయి.. వీటన్నింటి వల్ల భూ వివాదాలు పెరుగుతున్నాయి.. ఏ రైతన్న కూడా తమ భూముల కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదు.. భూమిపై ఎటువంటి వివాదం లేకుండా ప్రభుత్వం టైటిల్‌ ఇన్సూరెన్స్‌ చేస్తుందని వెల్లడించారు.. భూములపై వివాదాలు ఏమైనా వస్తే.. ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుందని స్పష్టం చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.

ఇక, రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు డాక్యుమెంట్లు ఇవ్వడంలేదని అబద్ధాలు చెబుతున్నారంటూ విపక్షాలపై విరుచుకుపడ్డారు సీఎం జగన్‌.. ఇప్పటి వరకు 9 లక్షల రిజిస్ట్రేషన్లు చేయడమే కాకుండా.. ఆ పత్రాలను భూ యజమానులకు ఇచ్చాం అన్నారు.. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్ అనేది రాబోయే రోజుల్లో గొప్ప సంస్కరణ అవుతుంది.. భూ వివాదాల వల్ల రైతులు, ప్రజలు.. కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది. ఆ పరిస్థిత పోవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యంగా వెల్లడించారు.. వైసీపీకి ఓటేస్తేనే పథకాల కొనసాగింపు.. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే కొండచిలువ నోట్లో తలపెట్టినట్టే అని మరోసారి హెచ్చరించారు.. మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీలు నెరవేర్చామన్నారు. మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగబోతోంది. ఇవి కేవలం ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు. మీ ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు.. ఇంటింటి అభివృద్ధి అన్నారు సీఎం జగన్.

పేదల భవిష్యత్తు మారాలన్నా.. లంచాలు లేని అవినీతి రహిత పాలన కొనసాగాలన్నా వైసీపీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు సీఎం జగన్‌.. రెండు బటన్‌లు నొక్కాలి.. ఫ్యాన్‌ గుర్తుకే ఓటు వేయాలి.. 175కి 175 అసెంబ్లీ సీట్లు.. 25 ఎంపీ సీట్లకు 25 ఎంపీ సీట్లు కూడా మనమే గెలవాలి.. ఒక్కటి కూడా తగ్గేది లేదు.. సిద్ధమేనా? అని ప్రశ్నించారు. ఇక, రాజకీయాలు దిగజారిపోయాయి.. భయంకరమైన అబద్ధాలు చూస్తున్నాం. ఇదే చంద్రబాబు తన మనుషులతో అవ్వాతాతలకు వాలంటీర్ల ద్వారా పెన్షన్‌లు ఇంటికి రాకుండా చేశారనా ఆవేదన వ్యక్తం చేశారు.. ఆ అవ్వాతాతలు తిట్టుకుంటుంటే.. ఆ నెపాన్ని ప్రభుత్వం మీద నెట్టే యత్నం చేస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? అని ఫైర్‌ అయ్యారు సీఎం వైఎస్‌ జగన్‌. ఇక, హిందూపురం సభలో సీఎం వైఎస్‌ జగన్‌ ఏం మాట్లాడారో పూర్తి ప్రసంగం కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..